తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ తగిలింది. పర్యావరణ అనుమతులు లేకుండా కృష్ణానదిపై పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినందుకుగాను తెలంగాణ ప్రభుత్వానికి చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది. తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ రూ. 920 కోట్ల జరిమానా విధించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పుష్పా సత్యనారాయణ నేతృత్వంలోని చెన్నై ఎన్జీటీ ధర్మాసనం పర్యావరణ అనుమతులు లేవని గుర్తించి ప్రాజెక్టు అంచనా వ్యయంలో 1.5 శాతం జరిమానా విధించింది.
పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం, కర్నూలుకు చెందిన చంద్రమౌళేశ్వర రెడ్డి అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ఎన్జీటీ.. తెలంగాణ ప్రభుత్వానికి భారీ జరిమానా విధించించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం వ్యవహారంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తున్నామని ఎన్జీటీ పేర్కొంది.
అలాగే జరిమానా మొత్తాన్ని మూడు నెలల్లో చెల్లించాలని ఆదేశించింది. కృష్ణా నది మేనేజ్‌మెంట్ బోర్డు వద్ద జరిమానా మొత్తాన్ని జమ చేయాలని చెప్పింది. ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌లో పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినందుకు తెలంగాణ ప్రభుత్వానికి రూ.300 కోట్లు జరిమానా విధించింది. పర్యావరణ నష్ట పరిహారం కింద పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.528 కోట్లు, డిండి ప్రాజెక్టుకు రూ.92 కోట్లు జరిమానా విధిస్తున్న ఎన్జీటీ తన తీర్పులో పేర్కొంది.