ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆ నవ వధువుకు విషాదమే మిగిలింది. ఒకరిని కాపాడబోయి వరుడు పెళ్లైన మూడో రోజే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దౌల్తాబాద్ మండలంలోని అల్లాపూర్ గ్రామంలో మౌలాన్‌సాబ్, జహీరాబీ దంపతులు తమ ఐదుగురు కొడుకులతొ కలిసి ఉంటున్నారు. మార్చి 11న (గురువారం) చిన్న కుమారుడు యాసిన్(23) కు హైదరాబాద్‌కు చెందిన ఓ యువతితో ఘనంగా వివాహం జరిపించారు. ఈ క్రమంలో స్వగ్రామంలో గ్రామస్తులకు, బంధువులకు ఆదివారం విందు ఏర్పాటు చేయాలని భావించి అందుకు సంబంధించిన ఏర్పా ట్లు చేస్తున్నారు.
అయితే.. శనివారం యాసిన్ తన బంధువులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లాడు. యాసిన్ అన్న కుమారుడు సమీర్ ఒడ్డుపై ఉండగా.. మిగతా వారు చెరువులో ఈత కొడుతున్నారు. ఇంతో సమీర్ ఒడ్డుపై నుంచి చెరువులో పడ్డాడు. ఇది గమనించిన యాసిన్ అతడిని రక్షించే ప్రయత్నం చేశాడు. అయితే.. చెరువులోని ఓ గుంతలో ఇరుక్కుపోయాడు. గమనించిన బంధువులు నీటిపై తేలుతున్న సమీర్‌ను బయటికి తీసి చికిత్స నిమిత్తం 108లో ఆస్పత్రికి తరలించారు. బాలుడు క్షేమంగా ఉన్నాడు. అనంతరం యాసిన్‌ను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న కొత్తపెళ్లి కొడుకును చికిత్స నిమిత్తం బాలంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడని డాక్టర్లు చెప్పారు. పెళ్లైన మూడో రోజే నవ వరుడు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్త మూడో రోజే చనిపోవడంతో ఆ నవ వధువు ఓదార్చడం ఎవరి తరం కాలేదు.