తెలంగాణలోని పాఠశాలల్లో కొత్త నిబంధన.. బెంచీకి ఒక్కరే
New rule in schools in Telangana one student per bench.తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర
By తోట వంశీ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. పాఠశాలలను తెరచుకునేందుకు ఇటీవల ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. మహారాష్ట్రలో ఒకే పాఠశాలకు చెందిన 229 మంది విద్యార్థులు కరోనా బారిన పడడం కలకలం రేపడంతో.. పాఠశాలలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పాఠశాలల్లో బెంచీకి ఒక్క విద్యార్థినే కూర్చేబెట్టాలని, ప్రతి ఇద్దరు విద్యార్థుల మధ్య కనీసం ఆరడుగుల భౌతిక దూరం ఉండాల్సిందేనని పాఠశాల డైరెక్టర్ దేవసేన స్పష్టం చేశారు. ఈ నిబంధనను రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు.
మొత్తంగా తరగతి గదిలో 20 మందిని మాత్రమే కూర్చోబెట్టాలని సూచించారు. ఈ నిబంధనలను అమలు చేయని పాఠశాలలపై అంటువ్యాధుల నియంత్రణ చట్టం ప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించారు. కోవిడ్ నిబంధనలు పాటించని పాఠశాలల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించిన నేపథ్యంలో నిబంధనల అమలు విషయంలో పక్కాగా వ్యవహరిస్తామన్నారు.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9, 10 తరగతుల ప్రత్యక్ష బోధన ప్రారంభించామని, 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన బుధవారం నుంచి ప్రారంభించిన నేపథ్యంలో మరో మూడు, నాలుగు రోజుల్లో సీనియర్ అధికారుల నేతృత్వంలోని బృందాలు పాఠశాలల్లో తనిఖీలు చేస్తాయని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు కూడా పాఠశాలల నిర్వహణను పర్యవేక్షిస్తాయని తెలిపారు. ప్రతి పాఠశాల నిబంధనలను పాటించాల్సిందేనని, తరగతి గదులు సరిపోకపోతే, విద్యార్థులు ఎక్కువగా ఉంటే షిఫ్ట్ విధానంలో నిర్వహించుకోవచ్చని, జిల్లా కమిటీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.