ఇతర రాష్ట్రాల నుంచి కరోనా మహమ్మారి చికిత్స కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చే బాధితులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని ఆస్పత్రిలో బెడ్ కన్ఫర్మేషన్ తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలకులకు లేఖ రాశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కరోనా రోగులు ముందుగా పడక గురించి మాట్లాడుకోకుండానే చికిత్స కోసం వస్తున్నారని.. వచ్చాక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ విలువైన చికిత్స సమయాన్ని కోల్పోతున్నారని ప్రభుత్వం గుర్తించింది.
ఇలా వచ్చేవారు స్ట్రెయిన్ల వ్యాప్తికి కారణమవుతున్నారనీ బావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అంటువ్యాధుల నివారణ, విపత్తుల నిర్వహణ చట్టం కింద విధివిధానాలు జారీ చేసింది. కోవిడ్ రోగి అ్మడిషన్ కంటే ముందే ఆస్పత్రి అనుమతి అవసరమని పేర్కొంది. ప్రభుత్వ కంట్రోల్ రూమ్ కు ఆస్పత్రులు దరఖాస్తు చేసుకోవాలని.. రోగులకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని పేర్కొంది. ఈ వివరాలను కంట్రోల్ రూము (040 2465119, 9494438251)కు కానీ, లేదంటే idsp@telangana.gov.in వెబ్‌సైట్‌కు కానీ ఆయా ఆసుపత్రులు తెలియజేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రోగి పేరు, వయసు, రాష్ట్రం, అటెండెంట్ పేరు, మొబైల్ నంబరు, టైఫ్ ఆఫ్ బెడ్ వంటి వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారానే.. కంట్రోల్ రూమ్ నుంచి రోగులకు పాస్ మంజూర్ చేస్తామని వెల్లడించింది తెలంగాణ సర్కార్.