తెలంగాణలో మారిన డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు
తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి రవాణా శాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించి, వాహనదారుల్లో ట్రాఫిక్...
By - అంజి |
తెలంగాణలో మారిన డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు
తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి రవాణా శాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించి, వాహనదారుల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడమే లక్ష్యంగా సుప్రీంకోర్టు సూచనల మేరకు ఈ మార్పులు చేశారు. ఇప్పటివరకు లెర్నర్స్ లైసెన్స్ (LLR), ఆ తర్వాత డ్రైవింగ్ టెస్ట్ అనే రెండు దశలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఎల్‌ఎల్‌ఆర్ పరీక్ష రాయడానికి ముందే అభ్యర్థులు ఒక ఆన్‌లైన్ రోడ్డు భద్రతా అవగాహన పరీక్షను తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంటుంది.
ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే లెర్నర్స్ లైసెన్స్ పరీక్ష రాసే అవకాశం లభిస్తుంది. ఈ కొత్త ఆన్‌లైన్ పరీక్షను మొత్తం ఆరు మాడ్యూల్స్‌గా విభజించారు. ఒక్కో మాడ్యూల్ 30 నిమిషాల పాటు ఉంటుంది, అంటే మొత్తం పరీక్షా సమయం 3 గంటలు. ఇందులో రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, వీడియో పాఠాలు వంటివి ఉంటాయి. అభ్యర్థులు తమ ల్యాప్‌టాప్ కెమెరా ఆన్ చేసి ప్రత్యక్షంగా ఈ పరీక్షలో పాల్గొనాలి లేదా గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూళ్ల ద్వారా కూడా హాజరుకావచ్చు.
లైసెన్స్ పొందే ప్రక్రియ:
మొదట ఆన్‌లైన్ రోడ్డు భద్రతా అవగాహన పరీక్ష పూర్తి చేయాలి.
ఆ తర్వాత ఎల్‌ఎల్‌ఆర్ (LLR) పరీక్ష రాసి లెర్నర్స్ లైసెన్స్ పొందాలి.
ఆరు నెలల గడువులోపు డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరై పాస్ కావాలి.
చివరగా లైసెన్స్ స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా అభ్యర్థి ఇంటికి చేరుతుంది.
రోడ్డు క్రమశిక్షణను పెంచేందుకు ఈ మూడు దశల విధానం ఎంతో దోహదపడుతుందని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు.