తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) బస్సుల్లో తిరుపతికి వెళ్లే ప్రయాణీకులు తిరుమల శ్రీవారిని సులభంగా, శీఘ్రంగా ప్రత్యేక దర్శనం చేసుకునేందుకు బాలాజీ దర్శన్ కింద టీఎస్ ఆర్టీసీ ఓ ప్యాకేజీని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనికి భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ ప్యాకేజీని ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే 1.14లక్షల మంది భక్తులు దీనిని సద్వినియోగం చేసుకున్నారు.
ఈ విషయాన్ని టిఎస్‌ఆర్‌టిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి టీఎస్ఆర్టీసీ బస్సులు నడుపుతోందని, ప్రతి రోజు వెయ్యి మంది ప్రయాణీకులకు రూ.300 శీఘ్ర దర్శన టికెట్లు ఇచ్చేందుకు అవకాశం ఉందన్నారు. భక్తులు దీనిని ఉపయోగించుకోవాలని కోరారు.
టీటీడీ అధికారుల సహకారంతో ఆర్టీసీ తన వెబ్‌సైట్‌లో (www.tsrtconline.in) రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్‌లను ఈ ఏడాది జూలైలో ప్రవేశపెట్టినప్పటి నుంచి అనేక మంది ప్రయాణికులు రోజూ ప్రత్యేక దర్శన టోకెన్లతో బస్సు టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మద్దతుతో టిఎస్‌ఆర్‌టిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చొరవ తీసుకుని టిఎస్‌ఆర్‌టిసి బస్సులలో ప్రయాణించే ప్రయాణికులకు బస్సు టిక్కెట్‌తో పాటు రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టిక్కెట్లను అందించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆర్టీసీకి నిత్యం దాదాపు 1,000 ప్రత్యేక దర్శన టిక్కెట్లు ఇస్తారు.
బస్ ప్యాకేజీ కోసం, పౌరులు ఆన్‌లైన్‌లో www.tsrtconline.in లాగిన్ చేయవచ్చు లేదా టిక్కెట్ బుకింగ్ కౌంటర్‌లను సందర్శించి కనీసం ఒక వారం ముందుగానే దాన్ని పొందవచ్చు.