సేవ్ దామగుండెం ఫారెస్ట్.. వీఎల్‌ఎఫ్ రాడార్ స్టేషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు
అనంతగిరి కొండలలోని అటవీ భూములను వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ కోసం భారత నౌకాదళానికి కేటాయించాలని నిర్ణయించడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు, పర్యావరణ కార్యకర్తలు నిరసనకు దిగారు.
By అంజి Published on 29 July 2024 4:35 AM GMTసేవ్ దామగుండెం ఫారెస్ట్.. వీఎల్‌ఎఫ్ రాడార్ స్టేషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు
కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనంతగిరి కొండలలోని అటవీ భూములను వెరీ లో ఫ్రీక్వెన్సీ (VLF) రాడార్ స్టేషన్ కోసం భారత నౌకాదళానికి కేటాయించాలని నిర్ణయించడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు, పర్యావరణ కార్యకర్తలు నిరసనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హైదరాబాద్, వైజాగ్, ఢిల్లీ, జమ్మూ, భోపాల్, వరంగల్, ఇతర ప్రాంతాలతో సహా 18 కి పైగా నగరాల్లో నిరసనలు చేపట్టారు. 'సేవ్ దామగుండం ఫారెస్ట్' అంటూ ప్రజలు ప్రభుత్వ తీరుపై నిరసనకు దిగారు.
ఈ ప్రాజెక్ట్ పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
దాదాపు రూ. 2,500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రాడార్ ప్రాజెక్ట్.. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ (ENC) ప్రతిపాదించిన VLF రాడార్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగించి నౌకలు, జలాంతర్గాములతో కమ్యూనికేట్ చేయవచ్చు.ఈ ప్రాజెక్టును జులై 28న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
దశాబ్ద కాలంగా దామగుండం అటవీ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ, పర్యావరణవేత్తలు ప్రాజెక్టు ప్రభావాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా, పూడూరు మండలంలోని దామగుండం అడవులు జీవవైవిధ్యంతో ఉంటాయి. ఔషధ మొక్కలు, విలువైన వృక్షాలు, జంతుజాలంతో సహా వందలాది అరుదైన వృక్ష జాతులు ఉన్నాయి.
ఈ ప్రాజెక్ట్ లో భాగంగా 2,900 ఎకరాల అటవీ భూమిని ధ్వంసం చేయనున్నారు. సుమారు 12 లక్షల చెట్లను నరికివేయవలసి ఉంటుంది. ఈ ప్రాంతంలో యాంటెన్నా పార్క్ కోసం 1,400 ఎకరాలు, సాంకేతిక ప్రాంతాల కోసం 1,090 ఎకరాలు, అధికారిక, నివాస సముదాయాల కోసం 310 ఎకరాలు, రేడియేషన్ ప్రమాదాల కోసం 'సేఫ్ జోన్'గా 100 ఎకరాలు ఉంటాయి. ప్రాజెక్ట్ కారణంగా దీర్ఘకాలిక పర్యావరణ సమస్యలు, రాష్ట్రానికి, ప్రజలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి. ఈ ప్రాంతం కీలకమైన క్యాచ్‌మెంట్ జోన్‌గా పనిచేస్తుంది. దీని విధ్వంసం హైదరాబాద్‌లో వరదలను మరింత తీవ్రతరం చేస్తుంది. అదనంగా, చెట్లు మీథేన్ వాయువులను సంగ్రహించడంలోనూ, కార్బన్ డయాక్సైడ్ నిల్వ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అడవులకు జరిగే నష్టం స్థానిక వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపనుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఎంత?
20 గ్రామాల్లోని దాదాపు 60,000 మంది ప్రజల జీవితాలు ప్రభావితవ్వనున్నాయి. అడవిపై ఆధారపడిన చిన్న రైతులు, పశువులను మేపుకుంటూ జీవిస్తున్న కుటుంబాల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అటవీ విధ్వంసం మూసీ, కాగ్నా వంటి స్థానిక నదులపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రాజెక్ట్ నుండి వచ్చే రేడియేషన్, చెట్లను నరికివేయడం ఫలితంగా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరించారు. హైదరాబాద్‌తో సహా స్థానికుల్లో శ్వాసకోశ సమస్యలకు దారితీయవచ్చు. ఈ ప్రాంతం చారిత్రాత్మకంగా, మతపరంగా బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి నిలయం, ఇది కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రభావితమవుతుంది.
తెలంగాణలో అడవుల నరికివేత ఏ స్థాయిలో ఉందంటే:
ఈ ప్రాజెక్టుపై తెలంగాణ హైకోర్టు గతంలో నాలుగేళ్లపాటు స్టే విధించింది, అయితే ఈ ఏడాది మొదట్లో మళ్లీ ప్రాజెక్టు ముందుకు కదిలింది. 2020 పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిఐఎల్) ద్వారా తెలిసింది ఏమిటంటే.. గత ఐదేళ్లలో 12,12,753 చెట్లను నరికివేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించిందని, ఇది దేశంలోనే అత్యధిక అటవీ నిర్మూలన రేటుగా గుర్తించారు ఈ ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని, ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ప్రభావితమైన స్థానికులతో సంప్రదింపులు జరపలేదు. నిర్దిష్ట సాంకేతికత ఇన్‌స్టాల్ చేశాక.. చుట్టుపక్కల ప్రజలు, జంతువులు, అడవులు, భూమిపై చూపే ప్రభావం గురించి ఎలాంటి సమాచారం లేదు. ఈ ప్రాజెక్ట్ లో ఎలాంటి పారదర్శకత కూడా లేదు.
దామగుండం అడవులలో VLF రాడార్ ప్రాజెక్ట్‌ను కొనసాగించాలనే నిర్ణయాన్ని పునరాలోచించాలని, వీలైతే ఉపసంహరించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. "ఈ ప్రాజెక్టును నిలిపివేసి ప్రజలు, పర్యావరణం దీర్ఘకాలిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మేము పార్లమెంటేరియన్లు, రాష్ట్ర అసెంబ్లీ ప్రతినిధులను కోరుతున్నాము" అని సేవ్ దామగుండం ఫారెస్ట్ బృందం సభ్యులు తెలిపారు.
ప్రాజెక్ట్‌కి సంబంధించిన నిరసనలపై మరింత సమాచారం కోసం, 9059905437 ను సంప్రదించండి.