దేశ సంపద అందరికీ సమానంగా పంచాలి: కేటీఆర్‌

Nation’s wealth should be distributed equally to all, says Minister KTR. హైదరాబాద్: దేశంలోని సంపదను అన్ని వర్గాలకు సమానంగా పంచాల్సిన అవసరం ఉందని

By అంజి  Published on  2 Feb 2023 4:53 PM IST
దేశ సంపద అందరికీ సమానంగా పంచాలి: కేటీఆర్‌

హైదరాబాద్: దేశంలోని సంపదను అన్ని వర్గాలకు సమానంగా పంచాల్సిన అవసరం ఉందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాజకీయ నాయకులు రాజకీయాలపై కాకుండా ఆర్థికాంశాలపై దృష్టి పెట్టాలని అన్నారు. భారతదేశం శాశ్వత ఎన్నికల విధానంలో ఉంది. తరువాతి తరాలకు సంపద సృష్టించడం కంటే.. రాజకీయ నాయకులు ఎక్కువగా ఎన్నికలలో విజయం సాధించడంపై దృష్టి సారిస్తున్నారని అన్నారు. గురువారం ఎన్‌హెచ్‌ఆర్‌డీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'డీకోడ్ ది ఫ్యూచర్- ది నేషనల్ కాన్ఫరెన్స్'లో కేటీఆర్‌ ప్రసంగించారు.

భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమని, అయినప్పటికీ దేశ సంపదలో ఎక్కువ భాగం కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే ఉందని అన్నారు. 25 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఉండాలనే ఆకాంక్షను మన దేశ నాయకత్వం మనకు అందిస్తోందా, అలాగే సంపదను అన్ని వర్గాలకు సమానంగా ఎలా పంపిణీ చేయవచ్చో మనం ఆలోచించాలి అని కేటీఆర్‌ అన్నారు. ఫ్రీబీ కల్చర్ మన దేశానికి చెడ్డదని ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారని, అయితే భారత్ ఇప్పటికీ మూడో ప్రపంచ దేశంగా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

1980లలో భారతదేశం, చైనాలు దాదాపు ఒకే విధమైన జీడీపీలను కలిగి ఉన్నాయి. ఇప్పుడు చైనా 18 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉందని, భారతదేశం ఇప్పటికీ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉందని ఆయన అన్నారు. అదేవిధంగా జపాన్‌కు దాని భౌగోళిక సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. "చైనా, జపాన్ రాణించాయి ఎందుకంటే అవి అభివృద్ధిపై దృష్టి సారించాయి. భారతదేశం దృష్టి మాత్రం రాజకీయాలపై ఉంది" అని కేటీఆర్‌ అన్నారు.

ఏ నాయకత్వానికైనా అతిపెద్ద సవాలు సంపద లేదా మూలధన నిర్వహణ కాదని, ప్రజల నిర్వహణ అని పేర్కొన్న ఆయన, భారతదేశ బలం దాని యువ ఆలోచనా శక్తి అని అన్నారు. దురదృష్టవశాత్తూ యువతకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చేవారుగా కాకుండా ఉద్యోగాలను అందించే వారిగా తీర్చిదిద్దబడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ సహజ వనరులను, మానవ వనరులను సద్వినియోగం చేసుకుని 15 శాతం సీఏజీఆర్‌ని సాధించిందన్నారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు కాగా జాతీయ సగటు రూ.1.49 లక్షలు కాగా.. ఇప్పుడు రూ.2.75 లక్షలకు పెరిగిందని తెలిపారు.

హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ రాజధాని. గత 8.5 సంవత్సరాలలో తెలంగాణ టీఎస్‌-ఐపాస్‌ ద్వారా పరిశ్రమలకు దాదాపు 22,000 అనుమతులను జారీ చేసింది. 21 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించిందన్నారు. ఇతర దేశాల మాదిరిగా భారత్‌లోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడితే.. దేశం నెంబర్‌ వన్‌ స్థాయికి ఎదుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.

Next Story