శివాలయంలో ఉన్న నంది విగ్రహం పాలు తాగుతోందనే వార్త ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో వైరల్‌గా మారింది. దీంతో నందికి పాలు తాగించేందుకు భక్తులు శివాలయానికి పోటెత్తారు. మహా శివరాత్రి ముగిసిన తర్వాత ఇది జరగడంతో ఇదంతా శివయ్య లీలగా అక్కడికి వచ్చిన భక్తులు చెబుతున్నారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా క్రాంతినగర్‌లోని జరిగింది.
వివరాల్లోకి వెళితే.. క్రాంతినగర్‌లో శివాలయంలో నందికి కొందరు భక్తులు పాలు పోశారు. అయితే.. పాలు క్రమక్రమంగా తగ్గిపోవడాన్ని భక్తులు గమనించారు. దీంతో నంది పాలు తాగుతోందని.. ఇదంతా ఆ పరమ శివుడి మహిమ అని భక్తులు ఉప్పొంగిపోతున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా క్షణాల్లో దావానంలా వ్యాప్తించింది. ఇంకేముంది.. పరిసర గ్రామాల ప్రజలు ఆ ఆలయానికి పోటెత్తారు. నందికి పాలు తాగించేందుకు పోటి పడ్డారు. విగ్రహానికి పూజలు నిర్వహించారు.
అయితే.. నంది పాలు తాగడం లేదని.. ఎండల వల్ల విగ్రహాం పాలను పీలుస్తున్నట్లు అనిపించవచ్చునని కొందరు అంటున్నారు. నిజం ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. కాగా.. గతంలో తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడు పాలు తాగడం, సాయిబాబా విగ్రహాం నుంచి విభూతి రాలడం వంటి ఘటనలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే.