Nalgonda: కలకలం రేపుతోన్న లాకప్‌ డెత్‌.. పోలీస్ స్టేషన్​లో గిరిజనుడు మృతి

నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్​లో ఓ గిరిజనుడు చనిపోయాడు. భూ వివాదం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా ఈ ఘటన జరిగింది.

By అంజి  Published on  11 Dec 2023 7:51 AM IST
Nalgonda, Suspicious death, tribal, Chintapalli police station

Nalgonda: కలకలం రేపుతోన్న లాకప్‌ డెత్‌.. పోలీస్ స్టేషన్​లో గిరిజనుడు మృతి 

నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం లాకప్‌డెత్‌ జరిగింది. చింతపల్లి మండలం పాలెంతండాకు చెందిన సూర్యానాయక్‌(50)కు ఆయన సోదరుడికి మధ్య కొంతకాలంగా భూవివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అన్నదమ్ములు ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఎస్సై సతీశ్‌రెడ్డి ఆదివారం సాయంత్రం సూర్యనాయక్‌తోపాటు అతని సోదరుడిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి విచారణ జరిపారు. అదే సమయంలో సూర్యనాయక్‌ హైబీపీ రావడంతో పీఎస్‌లోనే కిందపడిపోయాడు. వెంటనే అతడిని బంధువులు, పోలీసులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సూర్య నాయక్‌ మరణించాడు.

పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. పోలీసులు కొట్టడం వల్లే సూర్యనాయక్‌ చనిపోయాడని ఆరోపిస్తూ అతడి బంధువులు ఆస్పత్రి దగ్గర ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఎంపీటీసీ వసంత్ నాయక్ దగ్గరుండి ఎస్సై సతీష్ రెడ్డితో కొట్టించారని మృతుడి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. ఎస్సై సతీష్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలంటూ బంధువులు డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు ఎస్పీ అపూర్వరావు తెలిపారు. ఎస్సై సతీశ్‌రెడ్డిని నల్లగొండ హెడ్‌ క్వార్టర్స్‌కు అటాచ్‌ చేసినట్టు ఎస్పీ తెలపడంతో వారు ఆందోళన విరమించారు. సూర్యనాయక్‌ను విచారిస్తుండగా బీపీతో పడిపోయాడని ఎస్సై సతీశ్‌రెడ్డి తెలిపారు.

Next Story