Nalgonda: రెండు రోడ్డుప్రమాదాలు, ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
నల్లగొండ జిల్లాల్లో విషాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు.
By Srikanth Gundamalla Published on 25 Dec 2023 11:21 AM ISTNalgonda: రెండు రోడ్డుప్రమాదాలు, ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
నల్లగొండ జిల్లాల్లో విషాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. వీరితో పాటు మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.
ఈ రెండు ప్రమాదాలతో నల్లగొండ జిల్లాలోని పెద్దవూర మండలం నిమ్మానాయక్ తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిమ్మానాయక్ తండాకు చెందిన కేశవులు (28) అనే యువకుడు ఆదివారం రాత్రి బైక్‌పై మిర్యాలగూడ నుంచి పెద్దవూరకు బయల్దేరాడు. ఈ క్రమంలో రాత్రి వేళ సైదులు (55) అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో అతన్ని ఢీకొట్టాడు. బైక్ వేగంగా ఉండటంతో.. అక్కడిక్కడే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ ప్రమాదం నిడమూనూరులోని వేంపాడు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత కాసేపటికే ఈ ప్రమాదం గురించి కేశవులు కుటుంబ సభ్యులు సమాచారం అందుకున్నారు. దాంతో.. తెల్లవారుజామున హడావుడిగా టాటాఏస్ వాహనంలో ఘటనాస్థలానికి బయల్దేరారు.
కేశవులు కుటుంబ సభ్యుల్లోని ఏడుగురు సోమవారం తెల్లవారుజామున ఘటనాస్థలానికి వెళ్తున్నారు. ప్రమాదస్థలానికి అరకిలోమీటరు దూరంలో ఉండగానే వీరికీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ టాటాఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమావత్ గన్యా (40), నాగరాజు (28), పాండ్య (40), బుజ్జి (38) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. టాటాఏస్‌లో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు ప్రమాదాల గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలాలకు వెళ్లారు. టాటాఏస్ ప్రమాదంలో గాయపడ్డ ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. మిగతావారి మృతదేహాలను మార్చురీకి తరలించారు. కాగా.. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనీ.. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ రోడ్డుప్రమాదంలో చనిపోయిన ఆరుగురిలో ఐదుగురూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో.. ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.