తెలంగాణలోకి ఎంట్రీపై తేల్చి చెప్పిన నల్గొండ డీఐజీ

Nalgonda DIG Ranganath Clarifies On E-Passes At Borders. నల్గొండ డీఐజీ రంగనాథ్ బోర్డర్ లో పరిస్థితులపై మాట్లాడారు. పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తామని తేల్చి చెప్పారు.

By Medi Samrat  Published on  24 May 2021 12:58 PM GMT
telangana entry
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-తెలంగాణ సరిహద్దు వద్ద క‌ట్టుదిట్టంగా త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. అంతర్రాష్ట్ర సరిహద్దులైన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద ఏపీ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ-పాస్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. కర్నూలు నగర శివారులోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద కూడా తెలంగాణ పోలీసులు త‌నిఖీలు చేస్తున్నారు. తెలంగాణలోకి ఈపాస్ లేకుండా వస్తోన్న‌ వారిని వెనక్కి పంపిస్తున్నారు. మరోసారి ఈ పాస్ లేకుండా వస్తే వాహనం సీజ్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. దీంతో చాలామంది వాహనదారులు వేరే అవకాశం లేకపోవడంతో వెనుదిరుగుతూ ఉన్నారు.


నల్గొండ డీఐజీ రంగనాథ్ బోర్డర్ లో పరిస్థితులపై మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం లేదా ఏపీ, తెలంగాణ పోలీసులు జారీ చేసిన పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తామని తేల్చి చెప్పారు. ఏపీ నుంచి వచ్చేవారు పోలీసుల సూచనలను పాటించాలని.. ఈ పాస్ లేకుండా వచ్చి సరిహద్దుల్లో ఇబ్బంది పడవద్దని సూచించారు. అంబులెన్సులపై ఎలాంటి ఆంక్షలు ఉండవని అన్నారు. కోవిడ్, ఇతర ఆసుపత్రులు ఇచ్చిన లెటర్స్, సంబంధిత పత్రాలను పోలీసులకు చూపించాల్సి ఉంటుందని రంగనాథ్ చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏపీ నుంచి వచ్చే వాహనాలను అనుమతిస్తామని తెలిపారు. ఈ పాస్ లేనివారు అత్యవసర వైద్య చికిత్స కోసం వచ్చినట్టైతే, తగిన ఆధారాలను చూపించాలని అన్నారు. తెలంగాణలోకి నో ఎంట్రీ అని చెప్పడంతో వాహనాలు బోర్డర్ లో పెద్ద ఎత్తున నిలిచిపోయాయి.


Next Story