తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకొచ్చారు. అయితే రాను రానూ ఆ పార్టీ దూకుడు తగ్గుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఈ నెల 17న నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. అక్కడ కూడా తప్పకుండా సత్తా చాటుతామని భారతీయ జనతా పార్టీ చెప్పగా ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఆ పార్టీ చతికిలపడిందని చెబుతూ ఉన్నారు. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ తప్పకుండా విజయం సాధిస్తుందని అంటూ ఉన్నారు. రెండు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా టీఆర్ఎస్ దే నాగార్జున సాగర్ అసెంబ్లీ అని అంటున్నారు.
సాగర్ ఉప ఎన్నిక ఎగ్జిట్స్ పోల్స్ ఫలితాలను 'ఆరా' సంస్థ వెల్లడించింది. అధికార టీఆర్ఎస్ కే ఓటర్లు మరోమారు పట్టం కట్టినట్టు 'ఆరా' తన అంచనాల్లో పేర్కొంది. టీఆర్ఎస్ కు 50.48 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ కు 39.93 శాతం, బీజేపీకి 6.31 శాతం ఓట్లు వచ్చినట్టు తెలిపింది.
'ఆత్మసాక్షి' సంస్థ కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పంచుకుంది. ఇందులోనూ టీఆర్ఎస్ దే గెలుపు అని చెబుతోంది..ఆ పార్టీకి 43.5 శాతం, కాంగ్రెస్ పార్టీకి 36.5 శాతం, బీజేపీకి 14.6 శాతం ఓటింగ్ వచ్చినట్టు 'ఆత్మసాక్షి' తెలిపింది.