'నా విజయం.. మహిళ సాధికారిత నూతన శకానికి నాంది పలుకుతుంది'
My victory... ushers in a new era of women empowerment.. says Palvai Sravanthi. మునుగోడు ఉప ఎన్నికల్లో తాను విజయం సాధించడం వల్ల తెలంగాణలోనే కాకుండా యావత్ దేశంలోనే మహిళా
By అంజి Published on 27 Oct 2022 8:46 PM ISTమునుగోడు ఉప ఎన్నికల్లో తాను విజయం సాధించడం వల్ల తెలంగాణలోనే కాకుండా యావత్ దేశంలోనే మహిళా సాధికారతలో నూతన శకానికి నాంది పలుకుతుందని మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. గురువారం నాడు ఆమె మర్రిగడ్డ మండలంలో నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల రాజకీయాల్లో మహిళలను సాధారణంగా బలహీనంగా పరిగణిస్తారని వారికి పార్టీ టిక్కెట్లు, పెద్ద పదవులలో చాలా తక్కువ అవకాశాలు వస్తాయని, ప్రధాన రాజకీయ పార్టీలు సాధారణంగా మునుగోడు నియోజకవర్గం వంటి క్లిష్ట పరిస్థితుల్లో మహిళల కంటే పురుష అభ్యర్థిపైనే ఆసక్తి చూపుతారని అన్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీ తన సామర్థ్యాలను చూసి అభ్యర్థిగా ఎంపిక చేశారని, ఉప ఎన్నికల్లో తన విజయం కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పుతుందని మహిళా సాధికారతకు ప్రతీక అవుతుందని ఆమె అన్నారు. 1980లో మెదక్ స్థానం నుంచి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గెలుపొందడం భారత రాజకీయాలను మార్చేసిందని, అదే విధంగా 1999 సార్వత్రిక ఎన్నికల్లో బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి దారితీసిందని అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో తన గెలుపు తెలంగాణ రాజకీయాలన్నింటినీ మార్చివేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు, టీఆర్‌ఎస్, బీజేపీల మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేయడం లేదని, నీతి, నైతికతతో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలిని నిలబెట్టేందుకు ప్రయత్నించడం లేదని, అసెంబ్లీలో తమ సమస్యలకు ప్రాతినిధ్యం వహించే సేవకురాలిని ఎన్నుకోవాలని ప్రజలను కోరుతోందని అన్నారు. తన విజయం ఎన్నికల రాజకీయాల్లో మహిళల పాత్రపై మొత్తం దృక్పథాన్ని మారుస్తుందని ఆమె అన్నారు.
ప్రచారానికి చివరి రోజైన నవంబర్ 1వ తేదీన ప్రతిపాదిత 'మహిళా గర్జన'ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మొత్తం ప్రచారంలో ఓటర్లందరి నుండి, ముఖ్యంగా మహిళలు, యువత నుండి తనకు అద్భుతమైన స్పందన వచ్చిందని. మహిళా గర్జన పెద్ద ఎత్తున విజయవంతం అవుతుందనే నమ్మకం తనకు ఉందని ఆమె అన్నారు.
2014-2018 వరకు ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహించినా ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారని ఆమె అన్నారు. ఫలితంగా 2018 ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డికి ప్రజలు ఓడించి కాంగ్రెస్ ప్రతినిధిని ఎన్నుకున్నారని ఆమె అన్నారు. అయితే ఎమ్మెల్యే గా ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టులు పొందడం, తన సంపద, వ్యాపారాన్ని విస్తరించడంపై మాత్రమే దృష్టి పెట్టారని ఆమె అన్నారు. మరిన్ని కాంట్రాక్టులు పొందేందుకు పార్టీ మారి బీజేపీలో చేరారని మునుగోడు ఉప ఎన్నికల కోసం రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
''టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రభాకర్‌రెడ్డి, బీజేపీకి చెందిన రాజగోపాల్‌రెడ్డి ఇద్దరినీ ప్రజలు గతంలో ఎన్నుకున్నారని ఇప్పుడు తాను చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వాలని, ఒక మహిళగా తాను ప్రజల సమస్యలపై లోతైన అవగాహనతో తనను గెలిపిస్తే మంచి ప్రజా ప్రతినిధిగా నిరూపించుకుంటాను'' అని ఆమె అన్నారు. మునుగోడు నియోజక వర్గంలో ఇప్పుడున్న హవా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విజయం సాధిస్తుందని స్రవంతి అన్నారు. ఇదే కారణంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు 'ఎమ్మెల్యేల అమ్మకాలు, కొనుగోళ్ల'పై టీఆర్‌ఎస్, బీజేపీలు రకరకాల డ్రామాలు ఆడుతున్నాయన్నారు. మునుగోడు ప్రజలు టీఆర్‌ఎస్, బీజేపీలు సృష్టిస్తున్న బూటకపు హంగామాకు తలొగ్గవద్దని, వారి విభజన, దురాశ రాజకీయాలను తిప్పికొట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు.