మునుగోడు ఉప ఎన్నిక : ఉదయం 11 గంటల వరకు 25.8శాతం పోలింగ్
Munugode Bypoll updates.గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన మునుగోడు ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 3 Nov 2022 6:43 AM GMTగురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన మునుగోడు ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 25.80 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటర్ స్లిప్‌తో పాటు ఏదైన గుర్తింపు కార్డు ఉంటేనే ఓటు వేసేందుకు సిబ్బంది లోనికి అనుమతిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
ప్రతీ పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. వీటిని నల్లగొండ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం, హైదరాబాద్‌లోని ఎన్నికల ప్రధానాకారి కార్యాలయానికి అనుసంధానం చేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,21,720 మంది పురుష, 1,20,128 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 119 కేంద్రాల్లో 298 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
నాయకుల ఆందోళన..
- మర్రిగూడలో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ శ్రేణులు ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. పోలింగ్ నిలిపివేయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
- మునుగోడు పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
- సంస్థాన్ నారాయణపురంలో పోలింగ్‌ను సీపీ మహేష్ భగవత్ పరిశీలించారు.
- నాంపల్లి మండలం మల్లప్పరాజుపల్లిలో రూ.10లక్షల నగదు పట్టుబడింది.
- చండూరులో రూ.2లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.