రేపే మునుగోడు ఉప ఎన్నిక.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
Munugode bypoll tomorrow, elaborate security arrangements in place. రేపు (గురువారం) జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
By అంజి
రేపు (గురువారం) జరగనున్న మునుగోడు ఉప ఎన్నికకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉప ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, నగదు పంపిణీని అరికట్టేందుకు ఈసీ 50 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించింది. మునుగోడులో 100 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయగా 3,366 మంది పోలీసులు, 20 మంది కేంద్ర భద్రతను కూడా ఏర్పాటు చేశారు. స్థానికేతరులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఈసీ ఆదేశించింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి.
298 పోలింగ్ కేంద్రాల్లో 1,192 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. మూడు ప్రధాన రాజకీయ పార్టీలు - టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్‌లు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, జోరుగా ప్రచారం నిర్వహించాయి. దాదాపు రెండు నెలలుగా మునుగోడు ఎన్నికల ప్రచారంతో హోరెత్తింది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన మళ్లీ ఎమ్మెల్యే సీటు గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు నియోజకవర్గంలో ఉండకూడదని, నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని ఎన్నికల ప్రధానికారి వికాస్ రాజ్ ఇప్పటికే వెల్లడించారు. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 105 సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ పోలీంగ్ సజావుగా జరిగే ఏర్పాట్లను చేశారు. మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరి వీరిలో మునుగోడు ప్రజలు ఎవరిని కరుణిస్తారో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ ఎన్నిక గెలుపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.