మునుగోడు ఉప ఎన్నిక‌ : రేపు మ‌ధ్యాహ్నానికి ఫ‌లితం.. విజ‌యం ఎవ‌రిని వ‌రించునో..?

Munugode by poll counting on Sunday. అంద‌రి దృష్టి మునుగోడు ఉప ఎన్నిక ఫ‌లితంపైనే ఉంది. ఆదివారం ఓట్ల లెక్కింపును

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Nov 2022 10:22 AM IST
మునుగోడు ఉప ఎన్నిక‌ : రేపు మ‌ధ్యాహ్నానికి ఫ‌లితం.. విజ‌యం ఎవ‌రిని వ‌రించునో..?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అంద‌రి దృష్టి మునుగోడు ఉప ఎన్నిక ఫ‌లితంపైనే ఉంది. ఆదివారం(న‌వంబ‌ర్ 6న‌) ఓట్ల లెక్కింపును చేప‌ట్ట‌నున్నారు. ఈ మేర‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. నల్లగొండ శివారు ఆర్జాలబావి స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాములో ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది. ఉద‌యం 8 గంట‌ల‌కు లెక్కింపు ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. ఒకే హాల్‌లో 21 టేబుళ్ల‌పై మొత్తం 298 పోలింగ్ బూత్‌ల్లోని ఈవీఎంల‌లో నిక్షిప్త‌మైన ఓట్ల‌ను 15 రౌండ‌ల్ల‌లో లెక్కించ‌నున్నారు.

ఉద‌యం 9 గంట‌ల క‌ల్లా తొలి ఫ‌లితం వెల్ల‌డి అయ్యే అవ‌కాశం ఉండ‌గా.. మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు తుది ఫ‌లితం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. మొద‌ట‌గా చౌటుప్ప‌ల్ మండ‌లంలోని ఈవీఎంల ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. ఆ త‌రువాత సంస్థాన్ నారాయ‌ణ‌పురం, మునుగోడు, మ‌ర్రిగూడ‌, నాంప‌ల్లి, గుట్టుప్ప‌ల మండ‌లాల ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది. ఓట్ల లెక్కింపులో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ఇప్ప‌టికే శిక్ష‌ణ ఇచ్చారు.

మునుగోడు ఉప ఎన్నిక‌లో 93.13శాతం పోలింగ్ న‌మోదు అయిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు. 2018 ఎన్నిక‌ల్లో 91.3 శాతం పోలింగ్ న‌మోదు కాగా.. ఈ సారి 1.8 శాతం పెరిగింది. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 2,41,855 మంది ఓట‌ర్లు ఉన్నారు. వీరిలో 2,25,192 మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఇందులో ప‌రుషులు 1,13,853 మంది ఉండ‌గా మ‌హిళ‌లు 1,11,338 ఉన్నారు.

మూడంచెల భద్రత

ఓట్ల లెక్కింపు కేంద్రం వ‌ద్ద మూడెంచ‌ల భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, రిటర్నింగ్‌ అధికారి రోహిత్‌సింగ్‌తో పాటు కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ కొన‌సాగ‌నుంది. ఇక‌ స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయగా 24గంటల పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ కొన‌సాగ‌నుంది.

Next Story