ఓ వైపు పొంచి ఉన్న కరోనా మహమ్మారి.. మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
Municipal Elections In Telangana. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు యథాతధంగా జరగనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
By Medi Samrat
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేస్తూ ఉంది ప్రభుత్వం. అయితే మున్సిపల్ ఎన్నికలు యథాతధంగా జరగనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 30న ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు లేవని ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్ జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎస్‌ఈసీకి అధికారులు తెలిపారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి ఎస్‌ఈసీ లేఖ రాసింది. ఈ నెల 30న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఐదు మున్సిపాలిటీలకు పోలింగ్ జరగనుంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ పురపాలికలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 30న ఎన్నికలు జరగనుండగా, మే 3న ఫలితాలు రానున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనాను అడ్డుకోడానికి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్, బెడ్లు, మందులు సరిపడా ఉన్నాయని అన్నారు. కరోనా వ్యాప్తి గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉందని.. హైదరాబాద్‌కు ఇతర ప్రాంతాల నుంచి రోజూ పెద్దసంఖ్యలో ప్రజలు వచ్చి వెళుతుంటారని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో కేసులు ఎక్కువగా వస్తున్నాయని.. రాష్ట్రవ్యాప్తంగా 22 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ట్యాంకర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనాను అరికట్టేందుకు సీఎం కేసీఆర్ ఎన్ని నిధులు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారన్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా వేసే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్‌ను కట్టడి చేసేందుకే రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నామన్నారు.