సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్ బహిరంగ లేఖ
MP Revanth Reddy open letter to CM KCR. పెన్షన్ అర్హత వయస్సు 57సంవత్సరాలకు తగ్గించడం, అర్హులైన వారందరికీ పెన్షన్ ఇవ్వడం.
By Medi Samrat Published on 14 Feb 2021 4:03 PM ISTపెన్షన్ అర్హత వయస్సు 57సంవత్సరాలకు తగ్గించడం, అర్హులైన వారందరికీ పెన్షన్ ఇవ్వడం గురించి ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ విషయంలో మీ ప్రభుత్వ తీరు ప్రచారం ఎక్కువ.. పనితనం తక్కువ.. అన్నట్టుగా ఉందని అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెన్షన్ల విషయంలో మీరిచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని ఫైర్ అయ్యారు.
రెండో సారి అధికారం ఇస్తే అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వడంతో పాటు, పెన్షన్ల అర్హత వయస్సును 60 నుంచి 57 ఏళ్లకు కుదిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. రెండేళ్లు పూర్తవుతున్నా మీ హామీకి అతీగతీ లేదని అన్నారు. పాదయాత్రలో పెన్షన్లకు సంబంధించి చాలా మంది తమ సమస్యలను చెబుతున్న క్రమంలో ఎంపీ రేవంత్ సీఎంకు లేఖ రాశారు.
దానిప్రకారం.. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా మంది వృద్దులు, ఒంటరి మహిళలు పెన్షన్ కు అర్హత ఉండి కూడా ఒక్క రూపాయి సాయం పొందలేకపోతున్నారు. పెన్షన్ అర్హత వయస్సు 57 ఏళ్లకు తగ్గిస్తామన్న మీ హామీ అమలు చేయకపోవడం వల్ల లక్షలాది మంది అర్హులు గత రెండేళ్లుగా పెన్షన్ కు దూరమయ్యారు. ఈ రెండేళ్లలో భర్తలను కోల్పోయిన ఒంటరి ఆడబిడ్డల విషయంలో సైతం ఇదే పరిస్థితి ఉంది. ఇంట్లో పెన్షన్ కు అర్హులైన ఇద్దరు వృద్దులు ఉంటే ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు. ఇద్దరిలో పెన్షన్ పొందుతున్న వారు చనిపోతే కనీసం ఆ సందర్బంలోనైనా మిగిలిన ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం లేదు. రెండేళ్లుగా పెన్షన్ కు అర్హులైన వృద్దులు, ఒంటరి మహిళలు ఎంత మంది అర్హులు ఉన్నారన్న ఎన్యూమరేషన్ జరగలేదు. దీంతో చాలా మంది అర్హులైన వారు పెన్షన్లు పొందలేక నిస్సహాయంగా మిగిలిపోతున్నారని.. అర్హులందరికీ పెన్షన్ అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు.