ఆ ఒక్క కుటుంబమే 10వేల ఎకరాలను ఆక్రమించింది: రేవంత్

బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  24 Aug 2023 11:48 AM GMT
MP Revanth Reddy,  BRS, CM KCR ,

 ఆ ఒక్క కుటుంబమే 10వేల ఎకరాలను ఆక్రమించింది: రేవంత్

బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బీఆర్ఎస్ అధినాయకత్వం విచత్ర ధోరణిలో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి నాలుగేళ్లుగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వని సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు ఏకంగా మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. వాళ్లకు మంత్రి పదవలు వచ్చాయ తప్ప.. తాండూరుకు ఒరిగిందేటో అర్థం కావడం లేదన్నారు రేవంత్‌రెడ్డి. నిన్నమొన్నటి వరకు కొట్లాడుకున్నవారు ఇప్పుడు.. పదవులు పంచుకుంటున్నారని విమర్శించారు. తాండూరులో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎంపీ రేవంత్‌రెడ్డి.. ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆగస్టు 26న చేవెళ్లలో కాంగ్రెస్ ప్రజా గర్జన సభ నిర్వహిస్తున్నామని.. కాంగ్రెస్‌ కార్యకర్తలంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో కేసీఆర్‌ ఎన్నో హామీలు ఇచ్చారని.. వాటిలో చాలా వరకూ నెరవేర్చలేదని అన్నారు. కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గాన్ని దత్తత తీసకుంటానని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పటి వరకు ఆ విషయంలో ఏం చేశారో చెప్పాలని ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తాను తాండూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులకు శిలాఫలకాలు వేయడం తప్ప బీఆర్ఎస్‌ చేసిందేమీ లేదని అన్నారు.

కొడంగల్‌కు రెండేళ్లలో కృష్ణా నీటిని తెస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి మర్చిపోయారంటూ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కొడంగల్ ప్రజలను కేసీఆర్ మరోసారి మోసం చేసేందుకు సిద్ధం అవుతున్నారని.. నియోజకవర్గ ప్రజలు ఇది గమనించి అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని రేవంత్‌రెడ్డి కోరారు. అయితే.. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే రెండు చోట్ల పోటీ చేస్తున్నారంటూ విమర్శించారు. సీఎం కేసీఆర్ గొంతులో ఓటమి భయం కనిపిస్తోందని అన్నారు. కేసీఆర్ కుటుంబం అనేక అక్రమాలకు పాల్పడిందంటూ ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబం హైదరాబాద్ చుట్టుపక్కల 10వేల ఎకరాలను ఆక్రమించిందంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

Next Story