సైదాబాద్ ఘటన అమానుషం.. ప్రజలకు రక్షణలేకపోతే ప్రభుత్వం ఎందుకు : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
MP Komatireddy comments on Saidabad Incident.సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచార ఘటన
By తోట వంశీ కుమార్ Published on 15 Sept 2021 2:05 PM ISTసైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచార ఘటన అమానుషమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 24గంటల్లోగా నిందితుడి పటుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని సీఎం కేసీఆర్, కేటీఆర్, హోం మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పరామర్శించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు డోర్ తెలిస్తే.. బాలిక బ్రతికి ఉండేదన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదని చెప్పేందుకు ఇది నిదర్శమని విమర్శించారు. బాలిక మృతికి రాక్షసుడు ఎంత కారణమో.. పోలీసులు కూడా అంతే కారణమన్నారు. నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో పోలీసు శాఖ అలసత్వం కనిపిస్తోందన్నారు. పోలీసులున్నది గాడిదలు కాయడానికా అని ఘాటుగా విమర్శించారు.
పోలీసులకు అవార్డులు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నారని.. డబ్బులతో అవార్డులు కొంటున్నారని ఎద్దేవా చేశారు. బతుకమ్మ అంటూ తెలంగాణ అంత తిరిగే కవిత, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇక్కడికి ఎందుకు రాలేదని.. దళిత, గిరిజన బిడ్డని కేసీఆర్ వివక్ష చూపిస్తున్నారా అని ప్రశ్నించారు. బాలిక చనిపోయి బాధలో ఉంటే.. జిల్లా కలెక్టర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పడం బాధాకరమన్నారు. సినియాక్టర్‌ను పరామర్శించడానికి మంత్రి తలసానికి సమయం ఉంటుంది కానీ.. బాలిక కుటుంబానికి ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. దిశ ఘటనలో చేసినట్లే చిన్నారి ఘటనలో నిందితుడిని శిక్షించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.