2012లో రోహింగ్యాలపై మిలిటరీ చర్యలకు దిగింది మయన్మార్. దీంతో ఇల్లూ, వాకిలి వదిలి కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశ సరిహద్దులు దాటారు రొహింగ్యాలు. రోడ్డు, సముద్ర మార్గాన చుట్టూ ఉన్న దేశాలకు చేరారు. ఇలా వచ్చిన వారు నగరంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా రొహింగ్యాలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో కొందరు పోలీసులు టిఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. వామన్‌రావు దంపతులను అందరూ చూస్తుండగానే హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కోర్టులను ఆశ్రయిస్తే అంతం చేస్తారా అని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులను ప్రారంభించారు.
రాష్ట్రంలో పేదలకు పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వలేని ప్రభుత్వం రోహింగ్యాలకు ఒకే అడ్రస్ పై 32 పాస్‌పోర్టులు ఇవ్వడమేంటని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణలో 78 పాస్‌పోర్టులు కేసులు బయటికి వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు నమోదు చేసి జైళ్లలో వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు తెరాస కార్యకర్తల్లా వ్యవహరిస్తుంటే.. కొంతమంది ఆత్మాభిమానం చంపుకుని విధులు నిర్వహిస్తున్నారని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు.