మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఆయన టీఆర్ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. సోమవారం( ఈనెల 18న) మధ్యాహ్నాం 2 గంటలకు ఆయన కారెక్కనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్.. మోత్కుపల్లికి పార్టీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణలోని సీనియర్ నాయకుల్లో ఒకరు. సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
కాగా.. మోత్కుపల్లి నర్సింహులు కారెక్కుతారు అనే ప్రచారం గత కొంత కాలంగా కొనసాగుతోంది. ఇటీవల ఆయన సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను సమర్థిస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధుకు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. కేసీఆర్‌ను తెలంగాణ అంబేద్కర్‌గా అభివర్ణించారు. ఈ క్రమంలోనే ఆయన టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. ఆయన పార్టీలో చేరితే ఏ రకమైన పదవి వస్తుందన్నదానిపై చర్చ కూడా సాగింది. ఆయన్ను దళిత బంధు ఛైర్మన్‌గా నియమించేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కూడా వచ్చాయి.