ఘోరం.. రెండు నెలల చిన్నారి వేలు కొరికిన కోతి
వరండాలో ఊయలలో ఉన్న చిన్నారిపై కోతులు దాడి చేశాయి. చిన్నారి కాలి బొటన వేలిని కొరికి వేశాయి.
By తోట వంశీ కుమార్ Published on 23 Feb 2023 11:02 AM ISTరెండు నెలల చిన్నారి వేలు కొరికిన కోతి
ఒకప్పుడు ఎటు చూసిన పచ్చని చెట్లు, అడవులు ఉండేవి. దీంతో జంతువులు జనారణ్యంలోకి అంతగా వచ్చేవి కావు. అయితే.. ఇటీవల కాలంలో విచ్చలవిడిగా చెట్లను, అడవులను ధ్వంసం చేస్తుండడంతో పలు జంతువులు జనారణ్యంలోకి వస్తున్నాయి. భయంతోనో, ఆహారం కోసమో దాడులు చేస్తున్నాయి. కొన్నిసార్లు వీటి బారిన పడి మనుషులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం.
ఇటీవల కాలంలో కొన్ని ప్రాంతాల్లో కుక్కలు, కోతుల బెడద ఎక్కువగా ఉంది. హైదరాబాద్ మహానగరంలో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి మరణాన్ని మరువక ముందే మరో దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. రెండు నెలల చిన్నారిపై కోతులు దాడి చేశాయి. చిన్నారి బొటన వేలుని కొరికివేశాయి.
కురవి మండలం మోదుగుల గూడెంలో ఓ కుటుంబం నివసిస్తోంది. రెండు నెలల చిన్నారిని ఇంటి వరండాలోని ఊయలలో పడుకోబెట్టి, నీళ్ల కోసం తల్లి ఇంట్లోకి వెళ్లింది. అంతే.. తల్లి అటు లోపలికి వెళ్లిందో లేదో కోతుల గుంపు చిన్నారిపై దాడికి దిగాయి. ఓ కోతి చిన్నారి కాలి బొటన వేలిని బలంగా కొరికింది. సగం వేలు కోల్పోయింది. తీవ్రమైన నొప్పితో ఆ చిన్నారి కేకలు వేయగా వెంటనే తల్లిదండ్రులు బయటకు వచ్చి చూడగా.. కాలి బొటన వేలు నుంచి రక్తం ధారగా కారుతూ ఉంది. చిన్నారి ఒంటిపై గాయాలు ఉన్నాయి.
వెంటనే ఆ చిన్నారిని తల్లిదండ్రులు మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చిన్నారికి చికిత్స చేస్తున్నారు.
కాగా.. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, చిన్నారులు, వృద్దులు, మహిళలపై దాడులు చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. అధికారులకు ఎన్నో సార్లు విన్నవించుకున్నా చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు.