ప్రభుత్వ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు: సీఎం రేవంత్
హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్ తదితర పట్టణాల్లోని ప్రభుత్వ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
By అంజి Published on 29 Feb 2024 6:40 AM IST
ప్రభుత్వ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు: సీఎం రేవంత్
హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్ తదితర పట్టణాలన్నింటా లే అవుట్లలో కమ్యూనిటీ అవసరాలకు ఇచ్చిన స్థలాలు తమ అధీనంలో ఉన్నాయా.. లేదా ఆక్రమణకు గురయ్యాయా.. వెంటనే సర్వే చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల ఏర్పాటుకు ముందుకొచ్చే కార్పేరేట్ కంపెనీలు, పేరొందిన పాఠశాలల యాజమాన్యాలకు వీటిని అప్పగించాలని సూచించారు. ఆ ప్రాంతంలోని పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు కనీసం 25 శాతం కోటాగా ఉచితంగా అడ్మిషన్లు ఉండేలా చూడాలని, దీంతో అన్ని ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు అందుబాటులోకి వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ సమీపంలోని పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరంగా ఉండే అందమైన జోన్‌గా తీర్చిదిద్దాలని సీఎం అధికారులకు సూచించారు. ఇటు అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ పార్కు, తెలంగాణ అమరుల జ్యోతి, అటు నెక్లెస్ రోడ్డు నుంచి ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు వరకు మొత్తాన్ని ప్రపంచ స్థాయి సందర్శనీయ ప్రాంగణంగా తయారు చేయాలని సీఎం సూచించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణలను తొలిగించి, పర్యాటకులు, సిటీ ప్రజలు తీరికవేళలో ఆనందంగా గడిపేలా ఈ ప్రాంతం ఉండాలని సీఎం అధికారులకు వివరించారు. దుబాయ్ తరహాలో స్కై వాక్ వే, ఫుడ్ స్టాళ్లు, చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ జోన్, గ్రీనరీ ల్యాండ్ స్కేప్లను..అభివృద్ధి చేయాలని సూచించారు. అవసరమైతే ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలను మరో రూట్ మళ్లించి, దీన్ని పర్యాటక జోన్ గా మార్చాలని సూచించారు. వెంటనే అంతర్జాతీయ స్థాయి కన్సెల్టెన్సీలతో ఈ ప్రాజెక్టు నమూనాలు తయారు చేయాలని సీఎం సూచించారు.