ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నేడు(గురువారం) భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హజరుకావాల్సి ఉంది. అయితే.. ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకోలేదు. ఈడీకి ఓ లేఖను రాశారు. అనారోగ్యం, సుప్రీం కోర్టులో కేసు కారణంగా ఈడీ విచారణకు హజరుకాలేకపోతున్నట్లు అందులో పేర్కొన్నారు. మరో తేదీని నిర్ణయించాలని, ఆరోజు తప్పక హజరు అవుతానని కోరారు. గత విచారణలో ఈడీ అడిగిన పత్రాలను తన న్యాయవాది ద్వారా అధికారులకు పంపారు కవిత. అయితే.. ఇందుకు ఈడీ అంగీకరిస్తుందా..? లేదా..? కవిత ఈడీ విచారణకు నేడు హజరు అవుతారా..? అన్నది ఉత్కంఠ రేపుతోంది.
మహిళలను ఈడీ కార్యాలయంలో విచారించకూడదని, దీనిపై స్టే ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో తన ఇంటి వద్దే ఈడీ అధికారులు విచారించాలని కోరారు. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం ధర్మాసనం కవిత పిటిషన్‌పై మార్చి 24న విచారించనున్నట్లు తెలిపింది.
కవిత విచారణ దృష్ట్యా మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ లు ఢిల్లీలోనే ఉన్నారు.