ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యి నేటికి నెల రోజులు అయ్యింది. తాజాగా కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఏప్రిల్ 23 వరకు కోర్టు జ్యూడీషియల్ కస్టడీ విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇవాళ్టితో ఆమె సీబీఐ కస్టడీ ముగిసింది. 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించాలని కోరుతూ అధికారులు కవితను కోర్టులో హాజరుపర్చారు. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామని.. విచారణకు ఆమె సహకరించలేదని సీబీఐ ఆరోపించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. 9 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఆమెను తిహార్ జైలుకు తరలించనున్నారు.
ఇదిలా ఉంటే.. మార్చి 15వ తేదీన హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారు. 10 రోజుల కస్టడీ అనంతరం మార్చి 26న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జుడీషియల్ రిమాండ్ విధించడంతో తిహార్ జైలుకు తరలించారు. ఇదే కేసులోకి రంగ ప్రవేశం చేసిన సీబీఐ ఆమెను ఈ నెల 12వ తేదీన మరోసారి అరెస్ట్ చేసింది. ఇప్పుడు మరోసారి కవిత కస్టడీ సీబీఐ కోర్టు పొడిగించింది. మరోవైపు కోర్టు ఆవరణలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని అన్నారు. బీజేపీ నేతలు మాట్లాడిన మాటలే సీబీఐ అడుగుతోందని అన్నారు. రెండేళ్లుగా అడిగిందే అడుగుతున్నారని కవిత అసహనం వ్యక్తం చేశారు.