ఢిల్లీ మద్యం కేసు రిమాండ్ రిపోర్టులో తన పేరును పేర్కొన్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురువారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం భారతీయ జనతా పార్టీ(బీజేపీ) హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ అని అన్నారు.
ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారని విమర్శించారు. వచ్చే డిసెంబర్‌లో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయని, మోదీ కంటే ముందుగా ఈడీ ఇక్కడకు వచ్చిందన్నారు. ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం బీజేపీ నీచమైన రాజకీయ ఎత్తుగడ అని దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి విచారణ ఎదుర్కోవడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం ఇస్తానని అన్నారు. అంతేకానీ మీడియాలో లీకులు ఇచ్చి నేతలకు ఉన్న మంచి పేరు చెడగొట్టాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రజలు తిప్పికొడతారనే విషయాన్ని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. కేసులు పెట్టుకోండి.. అరెస్టులు చేసుకోండి.. జైల్లో వేసుకోండి.. దేనికి భయపడేది లేదు.. ప్రజల మా వెన్నంటి ఉన్నంత కాలం.. ప్రజల కోసం టీఆర్ఎస్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నంత కాలం ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది రాదని కవిత అన్నారు.