కుటుంబ రాజకీయాలపై ప్రియాంకగాంధీ మాట్లాడటం విడ్డూరం: ఎమ్మెల్సీ కవిత
ప్రియాంకా గాంధీ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
By Srikanth Gundamalla Published on 19 Oct 2023 5:37 PM ISTకుటుంబ రాజకీయాలపై ప్రియాంకగాంధీ మాట్లాడటం విడ్డూరం: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారం చేపట్టాలని ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుంటే.. అధికార పార్టీ కూడా వాటికి కౌంటర్లు వేస్తోంది. తాజాగా ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంకా గాంధీ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్ లాల్ నెహ్రూ, నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ, ఇందిర కుమారుడు రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ కూతురు ప్రియాంక గాంధీ అంటూ దుయ్యబట్టారు. ఇది కుటుంబ పాలన కాదా.. మాట్లాడే ముందు స్క్రిప్ట్‌ను సరిచూసుకోవాలంటూ సెటైర్లు వేశారు ఎమ్మెల్సీ కవిత.
కాంగ్రెస్ నాయకులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు కవిత. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల ఖర్చులు లక్ష కోట్లు అని.. మరి వీటిలో లక్షల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని నిలదీశారు. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేయాలని అంటున్నారని.. ఆ పని చేస్తే భూమిపై హక్కు ఎవరిది అనేది ఎలా తెలుస్తుందని ఆమె నిలదీశారు. పొరపాటున కాంగ్రెస్ గనుక ఓటేస్తే కేవలం మూడు గంటల పాటే కరెంట్ వస్తుందని ఓటర్లను కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. విభజన హామీల కోసం కాంగ్రెస్ నాయకులు ఏనాడు మాట్లాడలేదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించని రాహుల్‌గాంధీకి తెలంగాణలో పర్యటన చేసేందుకు అర్హత లేదని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే చీకటి పాలనకు కేరాఫ్ అన్నారు.
కర్ణాటకలో రైతులకు ఐదుగంటల కరెంట్ కూడా ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని.. రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన తమది అని అన్నారు. కర్ణాటకలో ఏదో మంచి చేస్తారని అక్కడి ప్రజలు గెలిపిస్తే.. వారిని కాంగ్రెస్ నట్టేట ముంచిందంటూ తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్సీ కవిత. అలాగే తెలంగాణలో చెబుతున్న హామీలు కూడా నేరవేర్చేందుకు వీలుకానివి అని చెప్పారు.