ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ : ఈడీ రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు

MLC Kavita name in the ED chargesheet of Delhi Liqour Scam.ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Dec 2022 8:30 AM IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ : ఈడీ రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో ఎమ్మెల్సీ క‌విత పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్ర‌స్తావించింది. రిమాండ్‌లో ఉన్న అమిత్ అరోరా కీల‌క విష‌యాలు వెల్ల‌డించిన‌ట్లు తెలిపింది. కల్వకుంట్ల కవితను 'సౌత్ గ్రూప్' కీలక సభ్యుల్లో ఒకరిగా ఈడీ పేర్కొంది.

ఇప్పటి వరకు జరిపిన ద‌ర్యాప్తు ప్ర‌కారం అరెస్టయిన వ్యాపారవేత్త విజయ్ నాయర్.. ఆప్ నేతల తరపున 'సౌత్ గ్రూప్'(శరత్ రెడ్డి, కె కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రణలో) నుంచి రూ.100 కోట్లు తీసుకున్నారు. హోల్ సేల‌ర్స్‌కు ఇచ్చిన 12 శాతం ప్రాఫిట్ మార్జిన్ అర్థ‌భాగాన్ని ఆప్ లీడ‌ర్ల‌కు ముడుపుగా అప్ప‌గించ‌డానికి కేటాయించారు. ఇదే విషయాన్ని అమిత్ అరోరా తన స్టేట్‌మెంట్ ద్వారా వెల్ల‌డించిన‌ట్లు ఈడీ త‌న నివేదిక‌లో తెలిపింది.

ప్ర‌భుత్వ ఆదాయానికి గండికొట్టి అక్ర‌మార్జ‌న‌కు పాల్ప‌డేందుకు ఢిల్లీ మ‌ద్యం విధానాన్ని కొంద‌రు నేత‌లు ఒక ఆయుధంలా వాడుకున్నార‌ని ఈడీ ఆరోపించింది. వేల కోట్ల రూపాయ‌ల‌కు సంబంధించిన ఆధారాలు దొర‌క‌కుండా చూడ‌డానికి నిందితులు త‌మ ఫోన్ల‌ను ధ్వంసం చేశార‌ని న్యాయ‌స్థానికి తెలిపింది. ఆప్ నేత‌ల ప్ర‌యోజ‌నాల కోసం ఢిల్లీ ప్ర‌భుత్వం రూ.581 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. లైసెన్సు ఫీజులు స‌హా అన్నింటి రూపేణా రూ.2,873 కోట్లు రెవెన్యూను ప్ర‌భుత్వం న‌ష్ట‌పోయింది అని బుధవారం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా సహచరుడు అమిత్‌ అరోరాను రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తూ రిమాండ్‌ రిపోర్టును ఈడీ ధర్మాసనానికి అందజేసింది.

36 మంది నిందితులు, అనుమానితుల ఫోన్ నంబ‌ర్ల వివ‌రాల‌ను రిపోర్టులో పేర్కొంది. 36 మంది 170 ఫోన్ల‌ను వినియోగించి వాటిని ధ్వంసం చేశార‌ని తెలిపింది. అందులో 17 ఫోన్ల‌ను మాత్ర‌మే రిక‌వ‌రీ చేశామ‌ని, అన్నీ దొరికి ఉంటే ఈ కుంభ‌కోణంలో చేతులు మారిన ముడుపులు మ‌రికొన్ని వెలుగులోకి వ‌చ్చేవ‌ని తెలిపింది.

Next Story