జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎన్నికల్లో కవిత ఓడిపోవడానికి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఎంపీగా గెలిస్తే మాపై పెత్తనం చెలాయిస్తుందని.. ఎమ్మెల్యేలు అంతా కలిసి నిజామాబాదులో ఆమె కనబడకుండా చేయాలని.. కుట్రపూరితంగా వెన్నుపోటు పొడిచి ఆమెను ఎంపీగా ఓడగొట్టారని అన్నారు. కవిత ఓడిపోవడంతో ఎమ్మెల్యేలకు స్వేచ్ఛా, స్వతంత్ర్యం వస్తుందని.. అందుకే ఎమ్మేల్యేలు కుట్రపూరితంగా ఆమెను ఓడగొట్టారని జీవన్ రెడ్డి అన్నారు.
నిజమాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచి.. ఒక ఎంపీని గెలిపించుకోలేక పోయారా అని ప్రశ్నించారు. ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా 30 వేలకు పైగా మెజార్టీతో గెలిచారని.. దీని బట్టి చూస్తే ఎవరివల్ల కవిత ఓడిపోయిందో తెలుస్తుందన్నారు. కవిత అనుయాయులు, గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్ధులే కవిత ఓటమికి కుట్రపన్నారని అన్నారు. కవిత అమాయకురాలు కాదని.. ఈ విషయం ఆమె కూడా గ్రహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.