ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల‌ లెక్కింపు ప్రారంభం.. ఫ‌లితాలు మాత్రం..

MLC Election Vote Counting Started. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల

By Medi Samrat  Published on  17 March 2021 8:46 AM IST
MLC Election Vote Counting Started

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో 3,57,354 ఓట్లు పోల్ కాగా వాటిని సరూర్‌నగర్‌లో లెక్కిస్తున్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానం నుంచి పోల్ అయిన 3,86,320 ఓట్లను నల్గొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో లెక్కిస్తున్నారు. రాత్రి 8 గంటల వరకు బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టనున్నారు. 25 బ్యాలెట్‌ పత్రాల చొప్పున కట్టలు కట్టనున్నారు. ఇవాళ రాత్రి 9.30 తర్వాత తొలి రౌండ్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు రానున్నాయి. పెరిగిన పోలింగ్ తో పాటు జంబో బ్యాలెట్ తో కౌంటింగ్ సవాల్ గా మారింది. దీంతో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. 3 షిఫ్టుల్లో ఓట్లు లెక్కించనున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం కౌంటింగ్‌ కేంద్రాల్లో విస్తృత ఏర్పాట్లు చేసింది. ఒక్కో హాల్‌లో 7టేబుళ్ల చొప్పున మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేసింది.

టేబుల్‌కు 1000 చొప్పున ఏకకాలంలో 56 వేల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రెండో రోజు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు తేలకుంటే ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. 144వ సెక్షన్ విధించారు.





Next Story