అఫిడవిట్లలో తేడాలు ఉంటే.. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు హుష్ కాకి

ఎన్నికల సమయంలో అభ్యర్థులు అందించే అఫిడవిట్లు చాలా ముఖ్యం. కొంచెం తేడా కొట్టినా కూడా ఆ తర్వాత చిక్కులు తప్పవు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 July 2023 8:08 AM GMT
MLAs, MPs, false affidavit case

అఫిడవిట్లలో తేడాలు ఉంటే.. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు హుష్ కాకి 

ఎన్నికల సమయంలో అభ్యర్థులు అందించే అఫిడవిట్లు చాలా ముఖ్యం. కొంచెం తేడా కొట్టినా కూడా ఆ తర్వాత చిక్కులు తప్పవు. గెలిచాక ప్రత్యర్థులు కోర్టులకు ఎక్కి.. తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని రుజువు చేస్తే ఉన్న ఫలంగా పదవి నుండి దిగేయాల్సి ఉంటుంది. తాజాగా కొత్తగూడెం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు విషయంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడు అని తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. అయితే ఈ తీర్పు రావడం చాలా ఆలస్యమైందనే చెప్పొచ్చు. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి, వచ్చే ఏడాది లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. దాదాపుగా వారి పదవీకాలం ముగిసే సమయంలో ఈ తీర్పులు వచ్చాయి. చట్టం ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం ఉండడం వల్ల కేసుల తుది ఫలితం మరింత ఆలస్యం కావచ్చు.

వనమా వెంకటేశ్వరావు

కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావుకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు తీర్పును ఇచ్చింది. వనమా ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని తీర్పును వెలువరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. 2018 నుంచి ఇప్పటి వరకు వనమా ఎమ్మెల్యే పదవీకాలం చెల్లదని స్పష్టం చేసింది. ఎన్నికల అఫిడవిట్ లో వనమా తప్పుడు వివరాలను ఇచ్చారంటూ 2018లో హైకోర్టును జలగం వెంకట్రావు ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు వనమా ఎన్నిక చెల్లదని తీర్పును వెలువరించింది. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రూ. 5 లక్షల జరిమానా విధించింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వనమా గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన జలగం వెంకట్రావు రెండో స్థానంలో నిలిచారు. వనమాకు దాదాపు 81 వేల ఓట్లు రాగా, జలగంకు దాదాపు 77 వేల ఓట్లు వచ్చాయి.

మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైకోర్టులో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కూడా షాక్ తగిలింది. తన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలన్న మంత్రి అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. మంత్రిపై మహబూబ్ నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు వేసిన పిటిషన్ ను విచారణకు అనుమతించింది. ఎన్నికల అఫిడవిట్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు రాఘవేంద్ర రాజు. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. రెండు పక్షాల వాదనలు విన్న హైకోర్టు మంత్రి వాదనను తిరస్కరిస్తూ, రాఘవేంద్ర రాజు పిటిషన్ ను విచారణకు అనుమతి ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ టాంపర్ చేసి 2018లో పోటీ చేశారని మహబూబూనగర్ నియోజవర్గానికి చెందిన రాఘవేందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు.

బిబి పాటిల్

జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌కు కూడా సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన ఎన్నికను సవాలు చేస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థి కే మదన్‌మోహన్‌రావు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో రోజువారీ విచారణ చేపట్టకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్న పాటిల్‌ విన్నపాన్ని సుప్రీం తోసిపుచ్చింది. మదన్‌మోహన్‌రావు పిటిషన్‌పై రోజువారీ విచారణ జరపాలన్న హైకోర్టు నిర్ణయంపై పాటిల్‌ అప్పట్లోనే సుప్రీం ను ఆశ్రయించి స్టే పొందారు. తాజాగా సుప్రీం స్టేను తొలగించడంతో మదన్‌మోహన్‌రావు పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరుపనుంది. తనపై ఉన్న కేసుల గురించి పాటిల్‌ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనలేదని మదన్‌మోహన్‌రావు తన పిటిషన్‌లో ఆరోపించారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీగా బీబీ పాటిల్ విజయం సాధించారు. ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందున బీబీ పాటిల్ ఎంపిక చెల్లదంటూ కె. మదనమోహన్ రావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రోజువారీ విచారణకు హైకోర్టు ఆదేశించింది.

Next Story