ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు బహిరంగ లేఖ
MLA Vanama Venkateswara Rao open letter.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు
By తోట వంశీ కుమార్ Published on 6 Jan 2022 9:49 AM GMTభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విపక్షాలు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వనమా వెంకటేశ్వర రావు బహిరంగ లేఖను విడుదల చేశారు. పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం తనకు బాధగా ఉందన్నారు.
పోలీసులు, న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు. తన కొడుకును పోలీసులకు అప్పగించేందుకు సహకరిస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు. రాఘవ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరుతున్నానని చెప్పారు. రాఘవపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నియోజకవర్గానికి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతానని చెప్పుకొచ్చారు. ఇక పోలీసులు ఎప్పుడు పిలిచినా తన కొడుకుని అప్పగిస్తానని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ఆ లేఖలో చెప్పారు.
సోమవారం(జనవరి 3) తెల్లవారుజామున నాగ రామకృష్ణ తన భార్య శ్రీలక్ష్మీ, ఇద్దరు కుమారైలు సాహితి, సాహిత్యపై పెట్రోలు పోసి అనంతరం తాను నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనం కాగా.. మరో కుమారై సాహితి తీవ్రంగా గాయపడింది. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన సాహితి బుధవారం కన్నుమూసింది. కాగా.. ఆత్మహత్యకు ముందు నాగ రామకృష్ణ తీసుకున్న సెల్పీ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో రామకృష్ణ.. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవేంద్రరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
మీడియాలో సెల్పీ వీడియో ప్రసారం కావడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నివాసాన్ని బీజేపీ నేతలు ముట్టడించారు. ఎమ్మెల్యే పదవికి వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. నెల రోజుల క్రితమే పాల్వంచలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఆత్మహత్య చేసుకొన్న బాధితుడు కూడా వనమా రాఘవేందర్ రావు పేరును సూసైడ్ లేఖలో రాశాడు. అయితే ఈ కేసు నుండి రాఘవేందర్ రావు బెయిల్ పై బయటకు వచ్చాడు.