42 ఏళ్ల వ్యక్తికి ఆసరా ఫించన్.. ఎమ్మెల్యే ఆగ్రహం
MLA Rajender Reddy slams officials over 42 years man gets pension.వృద్ధాప్యంలో ఏ ఆసరా లేని వారిని ఆదుకునేందుకు ఆసరా
By తోట వంశీ కుమార్
వృద్ధాప్యంలో ఏ ఆసరా లేని వారిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లు ఇస్తోన్న సంగతి తెలిసిందే. అయితే.. కొన్ని చోట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అర్హులకు ఫించన్ అందకపోగా.. అనర్హులకు ఫించన్ అందుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో నిండా యాభై ఏళ్లు కూడా లేని ఓ వ్యక్తికి ఫించన్ మంజూరు అవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సరిపడా వయసు లేని వ్యక్తిని లబ్ధిదారుడిగా ఎంపిక చేయడం ఏంటని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే.. మరికల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా శనివారం కొత్తగా మంజూరు అయిన ఫించను ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే లబ్ధిదారులకు ఫించన్ పత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఇంతలో ధ్రువపత్రం తీసుకువచ్చేందుకు మరికల్‌కు చెందిన మల్లేశ్ అనే వ్యక్తి అక్కడకు రాగా.. అతడిని చూసిన ఎమ్మెల్యే అవాక్కయ్యారు. అతడికి యాభై సంవత్సరాలు కూడా ఉండవని అర్థమైంది. 50 ఏళ్లు కూడా లేని నీకు వృద్ధాప్య ఫించన్ ఎలా మంజూరైందని ఆరా తీశారు.
అతడి ఆధార్‌కార్డును పరిశీలించగా.. అందులో అతడి వయస్సు 61 సంవత్సరాలు అని ఉంది. ఆధార్‌కార్డులో వయస్సు తప్పుగా నమోదు అయినట్లు తెలిసింది. ఆధార్ కార్డులో వయస్సు తప్పుగా నమోదు కావడం, క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించకుండా అనర్హుడికి ఫింఛను మంజూరు చేయడం ఏంటి అని అధికారులపై ఎమ్మెల్యే మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే.