హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. రాజాసింగ్ ఓ వర్గాన్ని రెచ్చగొట్టారంటూ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలు పెద్దవి కాకముందే.. రంగంలోకి దిగిన బీజేపీ అధిష్ఠానం రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే 10 రోజుల్లో వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ, మేం ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలంటూ షోకాజు నోటీసులు జారీ చేసింది.
అయితే, ఇదే విషయమై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. బీజేపీ అధిష్ఠానం పంపిన షోకాజ్ నోటీసులపై త్వరలోనే సమాధానం ఇస్తానని చెప్పారు. తన వివరణతో పార్టీ సంతృప్తి చెందుతుందని, పార్టీ తనను వదులుకోదని భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని రాజాసింగ్ వెల్లడించారు. తాను చేసిన వీడియోలో ఏ మతాన్ని కించపరచలేదని, తనపై నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు.
మరోవైపు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పాతబస్తీలో రాజాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా అర్థరాత్రి నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓ వర్గం వారు రోడ్లపైకి వచ్చి అర్ధరాత్రి రాజాసింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. చార్మినార్ దగ్గరకు అర్ధరాత్రి యువకులు భారీగా చేరుకుని పోలీసులపై రాళ్ల దాడి చేశారు. దీంతో రంగంలోకి దిగిన సౌత్ జోన్ డీసీపీ ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇవాళ తెల్లవారుజామున కూడా చార్మినార్ దగ్గర యువకులు గూమిగూడారు. దీంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.