రాజయ్య గెలుపునకు సహకరించా..ఇప్పడాయన వంతు: కడియం
రాజయ్య కూడా తనలానే నియోజకవర్గంలో పార్టీ విజయం కోసం తనకు సహకరిస్తాడని భావిస్తున్నట్లు కడియం తెలిపారు.
By Srikanth Gundamalla Published on 8 Sept 2023 6:58 AM ISTరాజయ్య గెలుపునకు సహకరించా..ఇప్పడాయన వంతు: కడియం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. కొన్ని చోట్ల మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం దక్కలేదు. ఇక కొన్ని చోట్ల ఆశావాహులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో కొంత రాజకీయ వర్గ విభేదాలు నెలకొన్నాయి. స్టేషన్ ఘన్‌పూర్ నుంచి రాజయ్య పోటీ చేసేందుకు చాన్స్ ఇవ్వలేదు కేసీఆర్. అక్కడ కొంత కాలం నుంచి కడియం శ్రీహరి వర్సెస్ రాజయ్య వ్యవహారం నడుస్తోంది. ఈసారి స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ దక్కించుకున్న కడియం శ్రీహరి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే రాజయ్య గెలుపు కోసం గతంలో తాను అండగా నిలబడ్డానని, ఇప్పుడు పార్టీ తనకు టికెట్ ఇచ్చిందని చెప్పారు కడియం. ఈ నేపథ్యంలో రాజయ్య కూడా తనలానే నియోజకవర్గంలో పార్టీ విజయం కోసం తనకు సహకరిస్తాడని భావిస్తున్నట్లు తెలిపారు. రెండుసార్లు అధిష్టానం రాజయ్యకు అవకాశం ఇచ్చింది.. అప్పుడు ఆయన విజయానికి కృషి చేసినట్లు కడియం శ్రీహరి చెప్పారు. తాను బీఆర్ఎస్‌లో చేరాక రాజయ్యకు అండగా నిలబడ్డానని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకూ పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నట్లు కడియం తెలిపారు. రాజయ్య కూడా తన విజయం కోసం సహకరిస్తారనే నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు. అయితే.. తనకు ఎలాంటి వ్యక్తిగత అజెండాలు లేవని.. ప్రజల శ్రేయస్సు, నియోజకవర్గ అభివృద్ధే తన అజెండా అని కడియం శ్రీహరి తెలిపారు.
స్టేషన్ ఘన్‌పూర్ ప్రజలు కూడా తనకు అండగా నిలబడి గెలిపిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు కడియం. పార్టీలో నాయకుల సహకారం, ప్రజల మద్దతుతో మరోసారి స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండా ఎగురవేస్తామని అన్నారు. ఇటీవల తెలంగాణలో పాలపొంగుగా కనిపించిన బీజేపీ ఇప్పుడు డీలా పడిపోయిందని విమర్శించారు. తెలంగాణలో నాలుగు సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. మొన్నటి వరకు తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఏవేవో చెప్పారని.. కానీ ఇప్పుడు నాలుగు సీట్లను గెలిపించుకోవడమే బీజేపీ నేతలకు కష్టమైపోతుందని చెప్పారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే ఉందని అన్నారు కడియం శ్రీహరి.