ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు

MLA Poaching case.. Accused challenge arrest in Supreme Court. నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా కొనుగోలు చేసేందుకు యత్నించారన్న.. ఆరోపణలపై

By అంజి  Published on  1 Nov 2022 5:17 PM IST
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు

నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా కొనుగోలు చేసేందుకు యత్నించారన్న.. ఆరోపణలపై రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్‌లను గపోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే తాజాగా ముగ్గురు నిందితులు తమ అరెస్టును సవాల్ చేస్తూ, తమను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నవంబర్ 4న సుప్రీం కోర్టు ఈ కేసును విచారించనుంది. నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై బీజేపీ ఏజెంట్లుగా ఉన్న ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించడంలో పోలీసులు విఫలమయ్యారని గమనించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు వారి రిమాండ్‌ను తిరస్కరించి విడుదల చేసింది.

దీంతో పోలీసులు హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ సి సుమలత ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలను కొట్టివేసి, ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోవాల్సిందిగా ఆదేశించారు. మరోవైపు, ఈ కేసులో సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయసేన్ రెడ్డి, ఈ కేసులో కొనసాగుతున్న దర్యాప్తును నిలుపుదల చేయాలని పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కేసు తదుపరి విచారణ కోసం నవంబర్ 4కు వాయిదా వేసింది. ఇప్పుడు తమ అరెస్టును సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Next Story