సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. గోదావరి వరదలతో ప్రజలు అల్లాడుతుంటే, ఇతరుల మీద నెపం నెట్టి కేసీఆర్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఈటల ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఈటల మాట్లాడారు. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. మాయమాటలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పబ్బం గడుపుతోందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను ఎవరూ నమ్మడం లేదన్నారు.
భారీ వరదల కారణంగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు చాలా నష్టపోయారని, మాటలు చెప్పకుండా, బాధితులను తక్షణం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఈటల రాజేండర్ డిమాండ్ చేశారు. "వరదలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇతరుల మీద నెపం నెడుతోంది. భద్రాద్రి ప్రజల గోడు ప్రభుత్వానికి వినిపించడం లేదా..? మాటలు చెబుతూ కాలాన్ని వెళ్లదీయడం మాని బాధితులను ఆదుకోవాలి. ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. బాధితులకు పరిహారం ఇచ్చి అండగా నిలవాలి." అని ఈటల పేర్కొన్నారు.