తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. జిల్లాలోని కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాల్లో మంగళవారం కొన్ని సెకన్లపాటు స్వల్పంగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపు భూమిలో ప్రకంపనలు వచ్చినట్లు మూడు మండలాల వాసులు తెలిపారు. ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఈ మండలాలు గోదావరికి ఉపనది అయిన ప్రాణహిత నది ఒడ్డున, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి.
యాదృచ్ఛికంగా, సరిహద్దు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో కూడా ఒక సెకను పాటు ప్రకంపనలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో సోమవారం ఉదయం 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంపం వల్ల ఎలింటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదు. కచ్‌లో తేలికపాటి భూప్రకంపనలు సంభవించడం సాధారణమే. భూప్రకంపన ఉదయం 7.35 గంటలకు నమోదయింది. దాని భూకంప కేంద్రం కచ్ జిల్లాలోని భచౌ నగరానికి 10 కిమీ. ఉత్తరఈశాన్య దూరంలో నమోదయినట్లు ఐఎస్‌ఆర్ తెలిపింది.