త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తాం: మంత్రులు
త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తామని మంత్రులు సురేఖ, సీతక్క వెల్లడించారు. 'కుటుంబ బాధ్యతలు వృత్తి బాధ్యతల్లో మహిళలు నిత్యం ఒత్తిడులకు గురవుతున్నారు.
By - అంజి |
త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తాం: మంత్రులు
హైదరాబాద్: త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తామని మంత్రులు సురేఖ, సీతక్క వెల్లడించారు. 'కుటుంబ బాధ్యతలు వృత్తి బాధ్యతల్లో మహిళలు నిత్యం ఒత్తిడులకు గురవుతున్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కూడా చూసుకోవాలి. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ నెల 22న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం. మహిళల సూచనలతో కొత్త మహిళా పాలసీని తీసుకొస్తాం' అని సెక్రటేరియట్ మహిళ ఉద్యోగుల సంక్షేమ సంఘం లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పేర్కొన్నారు.
నూతనంగా ఏర్పడిన తెలంగాణ సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘానికి (TSWEWA) మంత్రులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ''ఒకవైపు కుటుంబం, మరోవైపు వృత్తి బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ, సవాళ్లను అధిగమిస్తూ రాణించడం ఎంతో గొప్ప విషయం. ఈ నెల 22న మహిళల సవాళ్లపై చర్చించేందుకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. మీ అందరి అభిప్రాయాల ఆధారంగా నూతన పాలసీ రూపొందిస్తాం. మహిళలు ఐక్యంగా ఉంటే అద్భుతాలు సృష్టిస్తారు. కొందరు మహిళల ఐక్యతను దెబ్బతీసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై వస్తున్న విమర్శలు పురుషాహంకార, భూస్వామ్య భావజాలానికి నిదర్శనం. మహిళల ప్రతిభను అణచివేసే కుట్రలను గుర్తించాలి'' అని అన్నారు.
''తెలంగాణలో మహిళా స్వయం సహాయక బృందాలు అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. ఇందిరా మహిళా శక్తి అండగా పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు, సూపర్ మార్కెట్లు ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. మహిళా ఉద్యోగులకు మా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది'' అని మంత్రి సీతక్క అన్నారు.