మేడిగడ్డ, సుందిళ్ల పునరుద్ధరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: మంత్రి ఉత్తమ్

కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఛైర్మన్ అతుల్‌ జైన్‌తో తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు.

By Knakam Karthik
Published on : 7 May 2025 6:02 PM IST

Telangana News, Minister Uttam, Cwc Chairman Atuljain, Medigadda, Krishna Water

మేడిగడ్డ, సుందిళ్ల పునరుద్ధరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: మంత్రి ఉత్తమ్

కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఛైర్మన్ అతుల్‌ జైన్‌తో తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేడిగడ్డ, సమ్మక్క-సారక్క, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై చర్చ జరిగింది. తెలంగాణలో మేడిగడ్డ డ్యామ్ కూలిపోవడంతపై జాతీయ డ్యామ్ సంరక్షణ సంస్థ (ఎన్‌డీఎస్ఏ) నివేదిక సమర్పించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించారు.

సీడబ్ల్యూసీ ఛైర్మన్‌తో మీటింగ్ తర్వాత మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించాలా? లేదా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మేడిగడ్డ డిజైన్, ఆపరేషన్‌లో లోపాలు ఉన్నాయని ఎన్‌డీఎస్‌ఏ నివేదిక స్పష్టం చేసింది. ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా ప్రాజెక్టు పునరుద్ధరణ ఎలా చేయాలనే మార్గాలు అన్వేషిస్తున్నాం. డీపీఆర్‌లో చూపెట్టిన స్థలం వేరు, ఒక ప్రాంతంలో నిర్మిస్తామని మరో ప్రాంతంలో మేడిగడ్డ నిర్మించారు. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించాం..అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు 44 టీఎంసీల నీటి కేటాయింపులు వేగంగా జరపాలని కేంద్ర జల సంఘం ఛైర్మన్‌ను కోరినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 90 టీఎంసీల నీటి కేటాయింపు వేగంగా జరపాలని కోరినట్లు పేర్కొన్నారు. మొదటి విడత కింద వాటిలో తక్షణమే 45 టీఎంసీలు కేటాయించాలని విజ్ఞప్తి చేశాం. అక్రమ నీటి తరలింపునకు చెక్ పెట్టేందుకు కృష్ణా జలాలకు టెలిమెట్రీ పెట్టాలని కోరాం. పోలవరం బ్యాక్ వాటర్‌తో తెలంగాణ కొంత ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. దానికి రిటెన్షల్ వాల్ నిర్మించాలని కోరాం..అని మంత్రి ఉత్తమ్ తెలిపారు.

Next Story