హైదరాబాద్: అర్హతను బట్టి ఎంత మందికైనా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని మంత్రి ప్రకటించారు. అలాగే రేషన్ కార్డుదారులందరూ ఉచిత సన్నబియ్యానికి అర్హులు అని తెలిపారు. ప్రస్తుతానికి కార్డు లేకున్నా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉంటే సన్నబియ్యం ఇస్తామని ప్రకటించారు. ఉగాది రోజున హుజుర్‌నగర్‌లో సన్నబియ్యం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు.
ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రాబోతుందని ఉద్ఘాటించారు. భారత చరిత్రలో ఇది అతిపెద్ద ఆహార భద్రతా చొరవ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున సుమారు 85 శాతం మందికి సన్నబియ్యం అందుతుందని, త్వరలోనే పప్పు, ఉప్పు లాంటి సరకులు కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఎక్కడైనా రేషన్ తీసుకోవడానికి వీలుగా డ్రా సిస్టమ్ తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఈ పథకం ద్వారా 3 కోట్ల మందికి సన్న బియ్యం అందుతాయని అంచనా.