హైదరాబాద్: రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కడితే ఐదేళ్లలో 101 టీఎంసీలు మాత్రమే వాడుకున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. సంవత్సరానికి 195 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామని చెప్పారని, 2019లో ప్రారంభమైనప్పటి నుంచి 2023 అక్టోబర్ వరకు ఐదేళ్లలో 162 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారని తెలిపారు. ఇందులో 32 టీఎంసీలు సముద్రంలోకి వదిలిపెట్టారని చెప్పారు.
ఆవిరి పోనూ ఐదేళ్లలో 101 టీఎంసీలే వాడుకున్నారని, అంటే ఏడాదికి 20.2 టీఎంసీలేనని ఉత్తమ్ విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో విమర్శించారు. డ్యామ్‌కు బ్యారేజీకి తేడా లేకుండా పనులు చేశారని ఎన్‌డీఎస్‌ఏ నివేదికలో ఉందన్నారు. మేడిగడ్డలో పూర్తి నీరు నిల్వ చేసి కూలిపోయేందుకు కారణమయ్యారు. పూర్ ప్లానింగ్, డిజైన్ వల్లే అది కూలిందని ఎన్‌డీఎస్‌ఎఫ్ తేల్చి చెప్పారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 'మీరే డిజైన్ చేశారు. మీరే కట్టారు. మీ హయాంలోనే కూలింది. ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్' అని ఫైర్ అయ్యారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీరు నిల్వ చేయకున్నా పంటలకు నీరిచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. కాళేశ్వరం కూలిన తర్వాత ధాన్యం ఉత్పత్తిలో నం.1 అయ్యామన్నారు. కాళేశ్వరానికి రూ.87,449 కోట్లు ఖర్చు చేస్తే, రూ.21 వేల కోట్లతో కట్టిన 3 బ్యారేజీలు పూర్తిగా నిరుపయోగంగా మారాయని విమర్శించారు. తాము ఎక్కడా కక్ష సాధింపు ధోరణితో వెళ్లలేదని, పారదర్శకంగా విచారణ చేయించామని చెప్పారు.