30 వేల మందికి 'భూసార వలంటీర్లు'గా శిక్షణ.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో భూసార పరీక్షలను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. పొలాల్లో అధికంగా ఎరువులు వాడటం వల్ల నేల తల్లి...

By -  అంజి
Published on : 8 April 2026 7:42 AM IST

Tummala Nageswara Rao, Soil Health Volunteers, Telangana Agriculture, Soil Health Cards, Farmer Awareness, Fertilizer Usage, Huzurabad Dumping Yard, Rythu Nestham

30 వేల మందికి 'భూసార వలంటీర్లు'గా శిక్షణ.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో భూసార పరీక్షలను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. పొలాల్లో అధికంగా ఎరువులు వాడటం వల్ల నేల తల్లి దెబ్బతినడమే కాకుండా, రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల మంది యువ రైతులను ఎంపిక చేసి, వారికి 'భూసార వలంటీర్లు'గా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సచివాలయం నుంచి నిర్వహించిన 'రైతునేస్తం' వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈ వివరాలను వెల్లడించారు.

ఈ భూసార వలంటీర్లు గ్రామ స్థాయిలో రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తారు. ప్రభుత్వం నిర్వహించే భూసార పరీక్షల అనంతరం రైతులకు 'భూ ఆరోగ్య కార్డులు' (Soil Health Cards) అందజేస్తారు. అయితే, ఈ కార్డుల్లోని సాంకేతిక అంశాలు సాధారణ రైతులకు అర్థం కాకపోవచ్చు. అందుకే, ఆ కార్డులోని వివరాలను విశ్లేషించి.. ఏ పొలంలో ఏయే పోషకాలు తక్కువగా ఉన్నాయి, ఏ రకమైన ఎరువులు ఎంత మోతాదులో వాడాలి అనే విషయాలను సామాన్య రైతులకు అర్థమయ్యేలా వివరించడమే ఈ వలంటీర్ల ప్రధాన బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు.

అనంతరం, హుజూరాబాద్ మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్లు మరియు పలువురు సర్పంచ్‌లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు స్థానిక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా హుజూరాబాద్‌లో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ పనుల వల్ల స్థానికులకు కలిగే ఇబ్బందులను వివరించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆ డంపింగ్ యార్డ్ పనులను తక్షణమే నిలిపివేయాలని వారు మంత్రిని కోరారు. ఈ వినతిపై సానుకూలంగా స్పందించిన మంత్రి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Next Story