Telangana: త్వరలోనే అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ కనెక్షన్లు: మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణలో త్వరలోనే అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

By Srikanth Gundamalla  Published on  17 Sept 2024 7:13 PM IST
Telangana: త్వరలోనే అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ కనెక్షన్లు: మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణలో త్వరలోనే అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఫైబర్‌ నెట్‌వర్క్‌ అందుబాటులోకి తెస్తామన్నారు. దాని ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించినట్లు అవుతుందన్నారు. మంగళవారం మంత్రి శ్రీధర్‌బాబు కరీంనగర్‌లో ప్రజాపాలన దినోత్సవం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.

తెలంగాణలోని అన్ని గ్రామాలకు ఫైబర్ నెట్‌వర్క్‌ని విస్తరించి 20 ఎంబీ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సదుపాయాన్ని అందించాలని ఐటీ శాఖ కృషి చేస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా సంగుపేట, నారాయణపేట జిల్లా మద్దూరు, పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్‌ గ్రామాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేశామన్నారు. ఈ గ్రామాల్లో పూర్తిస్థాయిలో నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నామని చెప్పారు. ఈ పైలట్ గ్రామాల్లో ప్రధానంగా కేబుల్‌ టీవీ సర్వీస్‌, కేబుల్‌ వర్చువల్‌ డెస్క్‌టాప్‌ కనెక్టివిటీ, 20 ఎంబీ అన్‌లిమిటెట్‌ ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ, టెలిఫోన్‌ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్‌బాబు.360 డిగ్రీస్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించి సీసీ కెమెరాలు అమర్చుతున్నట్లు చెప్పారు. రెండు నెలల్లో పైలెట్‌ ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నామని వెల్లడించారు. ఆ తర్వాత అక్కడ ఎదురయ్యే పరిస్థితులు, సాంకేతికపరమైన లోపాలను గుర్తిస్తామన్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో సదుపాయాలపై అవగాహన వస్తుందని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు .

Next Story