Tealangana: త్వరలోనే జాబ్ క్యాలెండర్: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలో నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 18 Jun 2024 1:21 AM GMTTealangana: త్వరలోనే జాబ్ క్యాలెండర్: మంత్రి శ్రీధర్
తెలంగాణలో నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పింది. అయితే.. ఇప్పటికి అది ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. తాజాగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. జాబ్ క్యాలెండర్‌పై కీలక ప్రకటన చేశారు.
త్వరలోనే జాబ్ క్యాలెండర్ తెస్తామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. దాంతో.. నిరుద్యోగులకు కొంత ఉపశమనం లభించినట్లు అవుతోంది. ఆరు నెలలు గడిచినా జాబ్ క్యాలెండర్ తేకపోవడానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. గడిచిన పదేళ్ల పాటు బీఆర్‌స్ అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని ఆరోపించారు. వారు చేసిన దుర్మార్గాలను గాడిన పెట్టడం సమస్యగా మారిందన్నారు శ్రీధర్ బాబు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ పరీక్షలను అవకతకవకలతో చేపడితే.. తాము 12 ఏళ్ల తర్వాత గ్రూప్-1 పరీక్షను ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మూడు నెలలకే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు. మొన్నటి వరకు ఎన్నికల కోడ్ కొనసాగిందని చెప్పారు. ఇప్పుడిప్పుడు పాలనపై పట్టు సాధిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు మరోసారి స్పష్టంగా చెప్పారు.