గిరిజన సంక్షేమ శాఖ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నాం..అని తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో 7 వ గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశం ప్రారంభమైంది.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్క దారి పట్టించింది. ఆదివాసి గిరిజన ప్రాంతాలకు రోడ్లు బ్రిడ్జిలు అవసరం ..కానీ గతంలో నిధులు పక్కదారి పట్టించడం వల్ల గర్భిణి ప్రసవవేదన వంటి వార్తలు వస్తున్నాయి. ఏ ప్రభుత్వమైనా నిధులను పక్కదారి పట్టించవద్దు. ఎస్టీలకు కేటాయించిన నిధులను వారికి ఖర్చు చేయాలి. కేటాయించిన నిధులను అదే అసెంబ్లీ నియోజకవర్గంలో, అదే జిల్లాలో సర్దుబాటు చేయాలి తప్ప మైదాన ప్రాంతాలకు తరలించవద్దు..అని సీతక్క పేర్కొన్నారు.
సబ్ ప్లాన్ నిధులను పక్క దారి పట్టిస్తే ఏజెన్సీ ఏరియా వెనకబాటులోనే మగ్గిపోతుంది. అందుకే ఎస్టీలకు కేటాయించిన ప్రతి పైసా వారికి ఖర్చు చేయాలి. ఎస్టీల్లో ఎక్కువ మందికి ఉండటానికి ఇండ్లు లేవు. కాబట్టి ఎస్టీల ఇండ్ల నిర్మాణం కోసం బడ్జెట్ నిధులను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఎస్టీలకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కనీస స్థల అర్హతను సడలించాలని డిమాండ్ ఉంది. సీఎం దృష్టికి తీసుకెళ్లి దాన్ని పరిష్కరిస్తాం..అని మంత్రి సీతక్క తెలిపారు.