Telangana Secretariat: నూతన సచివాలయంలో సుదర్శన యాగం, చండీ హోమం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా.. హైదరాబాద్ నగర నడిబొడ్డున నిర్మించిన నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం
By అంజి Published on 30 April 2023 8:45 AM ISTTelangana Secretariat: నూతన సచివాలయంలో సుదర్శన యాగం, చండీ హోమం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా.. హైదరాబాద్ నగర నడిబొడ్డున నిర్మించిన నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. తెలంగాణ సంప్రదాయాలతో పూజలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు సుదర్శన యాగం, చండీ హోమాల్లో పాల్గొన్నారు. సచివాలయం ప్రాంగణంలో ఉదయం 5.50 గంటలకే రుత్విక్కులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఉదయం 6.15 గంటలకు సచివాలయం చేరుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు సుదర్శన యాగం, చండీ హోమాంతో పాటు వాస్తు పూజలో పాల్గొన్నారు.
హోమం, యాగ నిర్వహణ, సచివాలయంలో వివిధ చాంబర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో 110 మంది వేదపండితులు, రుత్విక్కులు పాల్లొంటున్నారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. సీఎంకు వేదపండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 1.20 నుంచి 1.32 గంటలకు పూర్ణాహుతిని నిర్వహిస్తారు. అనంతరం సీఎం కేసీఆర్ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌కు సీఎం కేసీఆర్ వెళ్తారు.
ఛాంబర్‌లో తన సీటులో ఆసీనులై ఫైలుపై సంతకం చేస్తారు. అలాగే రాష్ట్ర మంత్రులు తమతమ ఛాంబర్లలో మధ్యాహ్నం 1.56 నిమిషాల నుంచి 2.4 నిమిషాల మధ్య ఆసీనులవుతారు. సరిగ్గా మధ్యాహ్నం 2.15 నిమిషాల నుంచి 2.45 నిమిషాల మధ్య సచివాలయం ఉద్యోగులు, మంత్రులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. దీని కోసం అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యేవారి కోసం ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ఆదివారం నుంచే కొత్త సచివాలయం నుంచి అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.