టీఎస్ కాదు.. ఇక టీజీతో వెహికల్ నెంబర్లు, శుక్రవారం నుంచే..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కీలక నిర్ణయాలను తీసుకుంటోంది.
By Srikanth Gundamalla Published on 14 March 2024 5:45 PM IST
టీఎస్ కాదు.. ఇక టీజీతో వెహికల్ నెంబర్లు, శుక్రవారం నుంచే..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఆరు గ్యారెంటీల హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమల్లో నిమగ్నమైంది. ఇప్పటికే పలు గ్యారెంటీలను అలు చేసింది. గ్యారెంటీలపైనే కాదు.. పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ల నెంబర్లు టీఎస్‌తో మొదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా వాటిని మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక నుంచి టీఎస్‌గా కాకుండా టీజీగా వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్లు వస్తాయని పేర్కొంది.
ఈ మేరకు మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాలను వెల్లడించారు. ప్రజల మనోభావాల మేరకు తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్‌పై టీఎస్‌ను టీజీగా మార్చుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం అంటే మార్చి 15వ తేదీ నుంచే దీన్ని అమలు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ప్రకటన చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు. వారు ప్రజల ఆకాంక్షలను, మనోభావాలను పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అందరూ టీజీ అని రాసుకున్నామని గుర్తు చేశారు. టీజీ అని వాహనాలపై రాసుకున్నామంటే అందరి రాష్ట్ర ప్రజల అభీష్టం అని చెప్పారు. అందుకే శాసనసభ ఆమోదంతో టీఎస్‌ను టీజీగా మార్చాలని కేంద్రానికి పంపించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనికి ఆమోదం కూడా లభించిందనీ. శుక్రవారం నుంచి టీజీ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా జీవోలను రహస్యంగా కాకుండా.. బహిరంగంగానే చెప్పాలనుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.